కొత్తకొండ వీరభద్ర స్వామి అనుగ్రహంతో ఉద్యోగ ప్రాప్తి

మొక్కు చెల్లించిన హైదరాబాద్ భక్తురాలు
భీమదేవరపల్లి:జనవరి 09(జనం సాక్షి)
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవి ఆలయంలో భక్తిశ్రద్ధలతో చేసిన మొక్కు ఫలించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తురాలు ఉద్యోగం రావాలని కోరుతూ గతంలో కొత్తకొండ వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవికి మొక్కు మొక్కింది.ఉద్యోగం లభిస్తే మోకాళ్లపై నడుచుకుంటూ ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తానని మొక్కుబడి పెట్టింది.ఈ క్రమంలో ఆమెకు మహారాష్ట్ర రాష్ట్రం పూణేలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం లభించి మొదటి నెల జీతం కూడా అందుకుంది.
మొక్కు నెరవేరడంతో శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి కొత్తకొండ ఆలయానికి వచ్చిన భక్తురాలు మోకాళ్లపై నడుచుకుంటూ కూర్చుంటూ మూడు ప్రదక్షిణలు చేసి భక్తిశ్రద్ధలతో మొక్కును చెల్లించింది.ఈ సందర్భంగా ఆలయంలో భక్తిపూర్వక వాతావరణం నెలకొంది.
ఆలయ ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబు భక్తులకు వేద ఆశీర్వాదాలు అందజేస్తూ భక్తులు నిజమైన శ్రద్ధతో కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి. విద్య, ఉద్యోగం వివాహం, కుటుంబ జీవితం వంటి మానవ జీవితంలోని ప్రతి దశలో వీరభద్ర స్వామి సమేత భద్రకాళి దేవి అనుగ్రహం ఉంటుంద”ని తెలిపారు.
ఉద్యోగం వచ్చిన భక్తులు తమ శక్తి కొలది మొక్కులు చెల్లించడంతో పాటు తొలి జీతం నుండి దేవాలయ అభివృద్ధికి విరాళాలు అందించి భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్తకొండ వీరన్న దర్శనంతో భక్తుల జీవితాల్లో సుఖశాంతులు కలుగుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు భక్తులు కార్యక్రమంలో పాల్గొని ఆలయ మహిమను కొనియాడారు.


