ఇసుక అక్రమ ర్యాంపులపై దాడులు

10 ట్రాక్టర్లు, 3 లారీలు పట్టివేత
శ్రీకాకుళం, జూలై 10 : జిల్లాలోని ఆమదాలవలస మండల పరిధిలో గల నాగావళి నదీతీరంలో నడుస్తున్న పలు ఇసుక అక్రమ ర్యాంపులపై రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దాడులు నిర్వహించింది. మండలంలోని ముద్దాడపేట, కలివరం, నిమ్మతొర్లాడ తదితర గ్రామాల్లో దాడులు నిర్వహించి పది ట్రాక్టర్లు, 3 లారీలను పట్టుకున్నారు. ఇసుక అక్రమ ర్యాంపుల నుంచి విశాఖపట్నంకు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా మూడు లారీలను పట్టుకోగా వివిధ ప్రాంతాల్లో ఇసుక తరలింపునకు సిద్ధంగా ఉన్న పది ట్రాక్టర్లను పట్టుకున్నారు. పట్టుకున్న మూడు లారీల్లో రెండు లారీలను సీజ్‌ చేసి గనుల శాఖాధికారులకు అప్పగించామని తహశీల్దార్‌ వీర్రాజు తెలిపారు. ఒక లారీ పరారైనందున క్రిమినల్‌ చర్యలకు ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. పట్టుబడిన పది ట్రాక్టర్లలో ఏడింటిని సీజ్‌ చేసి, ఒక్కో ట్రాక్టర్‌కు 4వేల అపరాద రుసుము విధించినట్లు ఆయన తెలిపారు. మూడు ట్రాక్టర్లు పరారయ్యాయని వాటిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. దాడులు జరుగుతాయని ముందే సమాచారం అందుకున్న ఇసుక వ్యాపారులు వాహనాలను జీడి, మామిడి తోటల్లో నిలుపుదల చేశారని, దీంతో పాటు వాటిల్లో కొన్ని పరారయ్యేందుకు అవకాశం కలిగిందని తహశీల్దార్‌ తెలిపారు. ఈ దాడుల్లో ఆర్‌ఐ హేమసుందర్‌, రెవెన్యూ, పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు.