ఈ అర్ధరాత్రి నుంచే.. ఆర్టీసీ బాదుడు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): పేదోడి నెత్తిన మరో పిడుగు పడింది. నిత్యావసరాల ధరలతోనే బెంబేలెత్తుతున్న బడుగు జీవిపై డీజిల్‌ ధరలను పెంచి మంట పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పెరుగుతుందని చెప్పి బస్సు టిక్కెట్ల చార్జీలను కూడా పెంచేసి గరీబోడి నడ్డి విరిచింది. ఈ పెరిగిన చార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. బస్సు చార్జీలను 12 శాతం పెంచాలని నిర్ణయించారు. పల్లె వెలుగు బస్సుల్లో 25 కిలోమీటర్ల వరకు ఒక రూపాయి, 45 కిలోమీటర్ల వరకు 2 రూపాయలు, ఆపై ప్రతి కిలోమీటరుకు 5 పైసలు చొప్పున పెంచారు. డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఒక కిలోమీటరుకు 10 పైసలు, సూపర్‌ లగ్జరీ బస్సులకు 12 పైసల చొప్పున పెంచారు. ఇంద్ర, గరుడ, వెన్నెల ఏసీ బస్సులకు చార్జీల పెంపు లేదు. రద్దీని బట్టి అదనపు చార్జీలుంటాయి. చార్జీల పెంపుపై ఆర్టీసీ ఎం.డి. ఎ.కె.ఖాన్‌ మాట్లాడుతూ డీజిల్‌ ధరలు పెరగడం వల్ల చార్జీలు పెంచడం తప్పనిసరిగా మారిందని, అలాగే బస్సుల్లో అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తామని వివరణ ఇచ్చారు.
ముఖ్యంగా సామాన్యులు, మధ్య తరగతి ప్రజలపై అధిక భారం మోపింది. సంపన్నులపై కనికరం చూపి తన ద్వంద్వ నీతిని చాటుకుంది. ఇప్పటికే నింగినంటిన నిత్యావసర ధరలతో, డీజిల్‌ మోతతో, గ్యాస్‌ సిలిండర్ల పరిమితితో ప్రజలపై భారం మోపుతున్న రాష్ట్ర సర్కారు..తాజాగా మరో వడ్డనతో సామాన్యుల నడ్డి విరిచింది. ఆర్టీసీ నష్టానికి తన తిరోగమన విధానాలన్న కారణాన్ని పక్కన పెట్టి, నష్టాల సాకుతో, డీజిల్‌ ధర పెంపు సాకుతో ధరాఘాతానికి పాల్పడింది. పల్లెవెలుగుల్లో 25 కిలోమీటర్ల వరకు రూపాయి చొప్పున పెంచింది. 25 నుంచి 45 కిలోమీటర్ల వరకు 2 రూపాయలు, ఆపై ప్రతి కిలోమీటరుకు 5 పైసల వంతున పెంచింది. సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌లలో కిలోమీటరుకు 10 పైసల వంతున, సూపర్‌ లగ్జరీలో 12పైసల వంతున పెంచింది. గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల, ఓల్వో బస్సుల చార్జీలను యథాతథంగా ఉంచింది. ఆదివారం మధ్యాహ్నాం ఆర్టీసి అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే చావు కబురు చల్లగా చెప్పిన చందంగా చార్జిల భారాన్ని ఆదివారం అర్ధరాత్రి నుంచి మోపనున్నట్టు ప్రకటించింది. అంతేగాక జంట నగరాల్లోని బస్సు పాస్‌లను పెంచింది. ఆర్జినరీ, మెట్రో, మెట్రో లైనర్‌ బస్సుల నెలవారీ పాస్‌ల ధరను 100 రూపాయల మేర పెంచింది. అంతేగాక ఆర్డినరీ బస్సుల్లో నాలుగు రూపాయలుగా ఉన్న మినిమం చార్జిని 5 రూపాయలకు పెంచింది. అంతేగాక ప్రతి రెండు స్టేజీలకు అదనంగా చార్జీలను వసూలు చేయనున్నట్టు ఆర్టీసి తెలిపింది. చార్జీల పెంపు వల్ల హైదరాబాద్‌ నుంచి పలు ప్రధాన నగరాలకు పెరిగిన చార్జీల వివరాలు సుమారుగా ఈ విధంగా ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు సూపర్‌లగ్జరీ టిక్కెట్టు ధర రూ.253 రూపాయలకు చేరుకుంది. అదే ఎక్స్‌ప్రెస్‌కైతే రూ.194, డీలక్స్‌ అయితే 216 రూపాయలు చెల్లించాల్సిందే. అలాగే హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం (639కిలోమీటర్లు)కు 77 రూపాయలు పెరిగింది. సూపర్‌ లగ్జరీ పాత ధర 524 రూపాయలు కాగా 601 రూపాయికి చేరుకుంది. ఎక్స్‌ప్రెస్‌ రూ.461, డీలక్స్‌ 512 రూపాయలు. అలాగే హైదరాబాద్‌ నుంచి తిరుపతి (562కిమీ)కి సూపర్‌లగ్జరీ బస్సు చార్జీ 68 రూపాయలు పెరిగింది. పాత ధర 461 రూపాయి కాగా 529 రూపాయలకు చేరుకుంది. ఎక్స్‌ప్రెస్‌ రూ.405, డీలక్స్‌ 450 రూపాయలు. అలాగే హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు ఎక్స్‌ప్రెస్‌ చార్జీ పాతది 132 రూపాయలు కాగా 153 రూపాయలు. డీలక్స్‌ చార్జీ పాతది 149 రూపాయలు కాగా కొత్తది 170 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు ఎక్స్‌ప్రెస్‌లో అయితే రూ.103, డీలక్స్‌ 114, సూపర్‌ లగ్జరీ రూ.134 రూపాయలైంది. ఇదిలా ఉండగా పెంచిన ఆర్టీసీ చార్జిలు కిలోమీటరుకు 5 పైసల నుంచి 12 పైసలు ఉండడం అనేక విమర్శలకు దారితీస్తోంది. డీజిల్‌ లీటరుకు 5 రూపాయల వంతున చమురుసంస్థలు ఇటీవల పెంచిన విషయం తెలిసిందే.
ఆగ్రహించిన విపక్షాలు
చార్జిలను పెంచుతూ ఆర్టీసీ తీసుకున్న తాజా నిర్ణయంపై విపక్షాల నేతలు మండిపడ్డారు. తగ్గించకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీపిఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, బిజెపి నేత దత్తాత్రేయ, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలు ఆర్టీసి ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. లేకుంటే ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.