ఉక్కు పరిశ్రమలు అమ్మేస్తాం లేదా మూసివేస్తాం
రాజ్యసభలో కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడి
న్యూఢిల్లీ, మారి ్చ9 (జనంసాక్షి): దేశంలో ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రానిపక్షంలో వాటిని మూసివేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్కు కర్మాగారాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజ్యసభలో భాజపా ఎంపీ సస్మిత్ పాత్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ప్రైవేటీకరణ విభిన్న అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఐదేళ్లలో 5 ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ)అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఉక్కు తయారీ రంగం నాన్స్టాటజిక్ పరిధిలోకి వస్తుందని.. ఈ విభాగంలోకి వచ్చే ప్రభుత్వ రంగ వాణిజ్య పరిశ్రమలను సాధ్యమైనంత వరకు ప్రైవేటీకరిస్తామని.. లేనిపక్షంలో వాటిని మూసివేస్తామని తేల్చిచెప్పారు. ఆత్మనిర్భర భారత్ కోసం 2021 ఫిబ్రవరి 4న ప్రభుత్వ రంగ సంస్థల విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలు సంస్థలకు వర్తిస్తుందన్నారు. ఈ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఆ రంగంలోని ట్రెండ్స్, పరిపాలనా సాధ్యాసాధ్యాలు, పెట్టుబడిదారుల ఆసక్తిపై ఆధారపడి ఉంటుందని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.