ఉగ్రదాడిని ఖండించిన కేసీఆర్‌ 

– పుట్టినరోజు వేడుకలకు దూరం
– ఎవరూ తన పుట్టినరోజున వేడుకలు జరపొద్దు
– కార్యకర్తలు, అభిమానులకు సూచించిన కేసీఆర్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై దాడి ఘటనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో అనేక మంది జవాన్లు మృతి చెందడంతోపాటు చాలా మందికి తీవ్రగాయాలవడం పట్ల సీఎం కేసీఆర్‌ దిగ్భాంతి వ్యక్తంచేశారు. పేలుడులో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కశ్మీర్‌ లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారు. తాను కూడా తీవ్రంగా మనస్థాపానికి గురయ్యానన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని సీఎం కేసీఆర్‌ అభ్యర్థించారు. పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లను లక్ష్యంగా చేసుకుని, ఉగ్రవాదులు జరిపిన పేలుడులో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా..అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే.
కేసీఆర్‌ రిక్వెస్ట్‌.. అందరూ పాటించండి – కేటీఆర్‌
పుల్వామాలో ఉగ్రవాదుల ఘాతుకంతో జవాన్‌లు మృతి చెందడం బాధాకరమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఈ ఘాతుకాన్ని దేశం మొత్తం ఐక్యంగా ఖండించాలని కేటీఆర్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా ఉగ్రవాదుల ఘాతుకంతో సీఎం కేసీఆర్‌ తీవ్ర కలత చెందారని కేటీఆర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఈనెల 17న కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని, కార్యకర్తలు ఎక్కడా కేసీఆర్‌ పుట్టిన వేడుకలు జరుపుకోవద్దని కేటీఆర్‌ సూచించారు. ఇది కేసీఆర్‌ రిక్వెస్ట్‌ అని అందరూ పాటించాలని కోరారు. వేడుకలకు బదులు రక్త దానం, అవయవ దానం, మొక్కలు నాటడం
వంటి సమాజహిత కార్యక్రమాలను జరపాలని సూచించారు.