ఉగ్రవాదుల దాడుల్ని సమగ్రంగా ఎదుర్కొంటాం

శ్రీవారి సేవలో షిండే
తిరుమల, మార్చి 16 (జనంసాక్షి) :
ఉగ్రవాద దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటా మని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. శనివారం సాయంత్రం శ్రీవారిని దర్శించు కున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో పురోగతి సాధించామన్నారు. ఆ విషయాలను బహిరంగంగా చెప్పలేమని తెలిపారు. దేశంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. ఉగ్రవాదుల ముప్పుపై ఇంటెలీజెన్స్‌ వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. చొరబాటు దారులను ప్రోత్సహించినా, ఆశయ్రం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీకి సోనియాగాంధీ అధ్యక్షురాలిగా 15 ఏళ్లుగా సేవలందిస్తున్నారని  ప్రశంసించారు. ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకు ఉన్నత చదువులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని కొనియాడారు. స్వామి, అమ్మవార్ల దర్శనాలు సంతృప్తిగా జరిగాయని తెలిపారు. టీడీపీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు ప్రాతినిథ్యం వహిస్తున్న నరసాపురంలో ఆదివారం జరిగే ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తానని పేర్కొన్నారు.