ఉన్నమాటే చెప్పిన కెవిపి : ఎమ్మెల్యే విష్ణు
విజయవాడ, ఆగస్టు 2 : కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కెవిపి ఉన్నమాటే అన్నారని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ భవన్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో లేకపోవడంపై కెవిపి ఇటీవల వ్యాఖ్యానించగా దానిని కొందరు కాంగ్రెస్ నేతలు ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే విష్ణు గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఉన్న అభిప్రాయాన్నే కెవిపి వ్యక్తం చేశారని దానిపై ఇంత రాద్ధాంత దేనికని ఆయన అన్నారు. ఎవరు అవునన్నా, కాదన్నా రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో వైయస్‌రాజశేఖర్ రెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉందని దానిని ఎవ్వరూ విస్శరించరాదని అన్నారు. వైయస్ బ్రతికున్నప్పుడు ఆయనను విమర్శించినవారే, ఇప్పుడు కెవిపిపై ధ్వజమెత్తుతున్నారు తప్ప ఇతరులెవ్వరూ నోరు మెదపడం లేదని విష్ణు అన్నారు. దీన్ని బట్టి కెవిపిని మెజారిటీ, కాంగ్రెస్ వాదులు సమర్థిస్తున్నట్టు స్పష్టం అవుతున్నదని అన్నారు. ఇక దీనిపై చర్చ అనవసరమని వైయస్‌కు తగిన ప్రాధాన్యం ఇస్తేనే కాంగ్రెస్ బలపడుతుందని ఎమ్మెల్యే విష్ణు అన్నారు.