ఎంపి కృపారాణికి పరాభవం

శ్రీకాకుళం, జూలై 28 : శ్రీకాకుళం ఎంపి డాక్టర్‌ కిళ్లి కృపారాణికి శనివారంనాడు పరాభవం ఎదురైంది. పాతపట్నం మండలంలోని కొరసవాడ గ్రామంలో గల చేనేత కార్మికుల కాలనీలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌ ముఖాముఖి కార్యక్రమానికి తన సొంత వాహనంలో వస్తున్న కృపారాణిని పోలీసులు అడ్డుకున్నారు. ఆమె ఎంపినని చెప్పినా.. లోపలికి వదలకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి తన కార్యక్రమం ముగించుకుని తిరిగి వచ్చేంతవరకు ఆమె అక్కడే ఉండిపోయారు. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆమె తనను అడ్డుకున్న ఎస్‌ఐ మురళిని సస్పెండ్‌ చేయాలని పట్టుబట్టారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొండ్రు మురళి ఆమెకు నచ్చజెప్పినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇంతలో ముఖ్యమంత్రి ఆయనను సస్పెండు చేయాలని ఆదేశించారు. ఎస్‌ఐ మురళి విజయనగరంలో ట్రైనీగా డ్యూటీ చేస్తున్నారు. ఆయన స్వగ్రామం ఆమదాలవలస కాగా ముఖ్యమంత్రి పర్యటనకు గాను ఆయనకు డ్యూటీ వేశారు.