ఎఆర్‌ఐ బదిలీపై ముదురుతున్న విభేదాలు

జిల్లా కలెక్టరేట్‌ ఉత్తర్వులు బేఖాతరు
రాజకీయ నాయకుల పైరవీలు
కందుకూరు , జూలై 23 : జరుగుమల్లి మండల తహసీల్దారు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎఆర్‌ఐ ఉషారాణి బదిలీపై వ్యవహారం ముదిరి పాకానపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో శాఖాపరంగా జరిగిన బదిలీల్లో భాగంగా ఉషారాణి కందుకూరు మండల తహసీల్దారు కార్యాలయానికి బదిలీ చేస్తూ కలెక్టరేట్‌ నుండి ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఉత్తర్వులు అందుకున్న మండల తహసీల్దారు కార్యాలయ అధికారులు ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడం వలన బదిలీ ఉత్తర్వులు అందుకున్న ఉషారాణి నేటి వరకు కందుకూరు తహసీల్దారు కార్యాలయ విధుల్లో చేరలేదు. ఈ తతంగం అంతా జరుగుమల్లి మండలంలోని అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సమాచారం. గత నాలుగు సంవత్సరాలుగా జరుగుమల్లి మండలంలో ఎఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ఉషారాణి అధికార పార్టీ నాయకులకు అనువైన వ్యక్తిగా పేరుగడించినట్లు విపక్షాలు విమర్శిస్తున్నారు. అధికార పార్టీ చెప్పిన పనులు తూచా తప్పకుండా నిర్వహించడంలో ఉషారాణి మెళకువుగా వ్యవహరించేవారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తమకు అనుకూలమైన ఉషారాణి బదిలీనిలుపుదలకు అధికార పార్టీ నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు చివరికి బదిలీ నిలుపుదల అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లి మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది స్థానిక తహసీల్దారు కార్యాలయానికి ఉషారాణిని ఎందుకు రిలీవ్‌ చేయలేదని పదేపదే ఫోన్‌లు వస్తున్నా అధికార పార్టీ అండవున్న స్థానిక తహసీల్దారు కార్యాలయ సిబ్బంది స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు అనుకూలమైన అధికారి బదిలీ నిలుపుదలకు శతవిధాలా ప్రయత్నాలు ప్రారంభించడం సిగ్గుచేటని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదేమైనా జిల్లా కలెక్టరేట్‌ ఉత్తర్వులు బేఖాతరు కావడం ఈ వ్యవస్థలో ప్రతి అంశంపై పెరుగుతున్న మితిమీరిన రాజకీయ జోక్యానాకి నిదర్శనం అని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా అధికారుల ఉత్తర్వులు పనిచేస్తాయో లేక రాజకీయ పార్టీల పంతం నెగ్గుతుందో కాలమే సమాధానం చెబుతుంది. అంతవరకు వేచిచూద్ధాం. ప్రజాస్వామ్యంలో హక్కులు లేని ప్రజలకు వేచి చూడాల్సిన పరిస్థితే కదా.