ఎదుటివారి రక్షణలతోటే మనకు రక్షణ
సిఐ అక్కేశ్వరరావు
కందుకూరు , జూలై 28 : ఎదుటివారి రక్షణతోటే మనరక్షణ కూడా ఆధారపడి వుంటుందని డ్రైవర్లను ఉద్దేశించి స్థానిక పోలీసు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ అక్కేశ్వరరావు అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసి గ్యారేజీ ఆవరణంలో డిఎం మారెళ్ల శ్రీనివాసరావు ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ అక్కేశ్వరరావు మాట్లాడుతూ నేడు జరుగుతున్న ప్రమాదాల్లో అధికశాతం మద్యం, మానసిక ప్రశాంతత లేని వలనే జరుగుతున్నాయని అన్నారు. ప్రజల ప్రాణాలకు బాధ్యత వహించాల్సిన డ్రైవర్లు మద్యం సేవించరాదని ట్రాఫిక్ రూల్స్‌ను విధిగా పాటించాలని, ప్రయాణ సమయాల్లో సెల్‌ఫోన్‌లు వినియోగించరాదని అన్నారు. ఒక ప్రాణం ఖరీదు వెలకట్టలేనిదని, అలాంటి ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యతలో ఉండి విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తమకు ఏదైనా సమస్య ఉన్న యడల ఆ రోజు విధులకు సెలవులు పెట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎం మాట్లాడుతూ మనపై మన సంస్థపై నమ్మకం ఉంచి ప్రయాణిస్తున్న ప్రయాణీకుల ప్రాణాలకు రక్షణ ఇవ్వవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. అందువలన డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రయాణీకుల ప్రాణాలను, సంస్థ ప్రయోజనాలను రక్షించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మి, ఆర్టీసి డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.