ఎన్నికలకు సిద్ధం కండి

– టీఆర్‌ఎస్‌ పాలనను రాష్ట్రం నుండి పారదోలాలి
– రాహుల్‌ పర్యటనను అడ్డుకొనేందుకు ప్రభుత్వం కుట్రచేస్తుంది
– ఓయూలో రాహుల్‌ పర్యటించే విధంగా అందరూ సహకరించాలి
– ప్రధాని మోడీకి కేసీఆర్‌ చెంచాగిరి చేస్తున్నాడు
– విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
– గాంధీభవన్‌లో సేవాదల్‌ క్రాంతి దివస్‌
హైదరాబాద్‌, ఆగస్టు9(జ‌నం సాక్షి) : సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, తద్వారా టీఆర్‌ఎస్‌ పాలనను రాష్ట్రం నుండి పారదోలాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. సేవాదల్‌ క్రాంతి దివస్‌ సందర్బంగా గాంధీ భవన్‌ లో ఉత్తమ్‌ కుమార్‌ పార్టీ జెండాను ఎగురవేసారు. ఈ కార్యక్రమానికి జానా రెడ్డి, షబ్బీర్‌ అలీ.. ఏఐసీసీ కార్యదర్శులు బోస్రాజు, సలీం అహ్మద్‌, సంపత్‌ కుమార్‌ లు హాజరైయ్యారు. అనంతరం ఉత్తమ్‌ కుమార్‌ విూడియాతో మాట్లాడారు.. భారత దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌ అని ఉత్తమ్‌ గుర్తు చేశారు. ఇపుడు కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు క్విట్‌ టీఆర్‌ఎస్‌ లక్ష్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని, టీఆర్‌ఎస్‌ పాలనను రాష్ట్రం నుండి పారదోలాలి అని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ రాష్ట్ర పర్యటన సందర్బంగా వికృత చేష్టలు చేస్తున్నారని, ఓయూకు రాహుల్‌ వస్తే ఇబ్బంది అవుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు వెంట ఉండి ఆందోళన చేయిస్తున్నారని విమర్శించారు. ఓయూలో రాహుల్‌ గాంధీ పర్యటించే విధంగా అందరూ సహకరించాలన్నారు. తెలంగాణ ఇచ్చింది ఎవరో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు చెప్పాలన్నారు. తన కనుసన్నల్లో తెలంగాణ బిల్లు తయారయిందని చెప్పిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడెందుకు మాట మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా కేసీఆర్‌ ప్రధాని మోడీకి చెంచాగిరి చేస్తున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. విభజన హావిూలు ఎందుకు అమలు చేయించలేకపోయారని ఉత్తమ్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో అసంబద్ద పాలన సాగుతుందన్నారు. కేవలం మాటలగారడితో కేసీఆర్‌, అతని టీం ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో, పాత ప్రాజెక్టులకు అంచనా వ్యయాలను పెంచుకుంటూ ప్రజాసొమ్మును తెరాస నేతలు దోచుకుంటున్నారని ఉత్తమ్‌ మండిపడ్డారు.