ఎరుపెక్కిన ఎర్రవల్లి
– అరుణవస్త్రాలతో భక్తుల కోలాహలం
– కిక్కిరిసిన జనంతో యజ్ఞశాలలు
– హాజరైన శరద్ పవార్, రోశయ్య, నరసింహన్ దంపతులు
మెదక్,డిసెంబర్26(జనంసాక్షి): చండీయాగం నాలుగో రోజూ పలువురు ప్రముఖుల రాకతో మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుతచండీయాగ క్షేత్రం సందడిగా మారింది. అయుత చండీ మహా యాగం నాలుగో రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షేత్రంలో జరుగుతోన్న ఈ యాగానికి పలువురు ప్రముఖులు, భక్తజనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. నాలుగోరోజుకు చేరడంతో భక్తులు వెల్లువలా తరలివచ్చారు. నాలుగో రోజూ అదే దీక్షతో వేదమంత్రాల ఘోష సాగింది.అరుణవర్ణం అమ్మవారికి అత్యంత ఇష్టం. అలాంటి ఎరుపు వస్త్రాలను ధరించిన కర్త సిఎం కెసిఆర్ దంపతులు, రుత్విక్కులు యజ్ఞాదీక్షలో పాల్గొన్నారు. లేలేత కిరణాల మధ్య ఎరుపు వర్ణంతో ఎర్రవల్లి క్షేత్రం అరుణవర్ణశోభితంగా శోభిల్లింది. అరుణవర్ణ శోభితం..ప్రముఖుల ఆగమనం.. స్వావిూజీల ఆశీర్వచనం.. భక్తప్రభంజనం కొనసాగడంతో ప్రసాదాల పంపిణీలకి స్వల్ప అంతరాయం కలిగింది. యాగశాలకు చేరుకున్న సీఎం దంపతులకు వేద పండితులు పూర్ణకుంభం, పంచవాద్యంతో స్వాగతం పలికారు. గణపతిపూజతో పాటు ఏకాదశ న్యాస పూర్వక చతుసహస్ర చండీ పారాయణం నవావరణ పూజ, సప్త ద్రవ్య మృత్యుంజయ ¬మం, మహాసౌరం, ఉక్త దేవతా జపాలు, కుమారి సుహాసిని, దంపతీపూజ, మహామంగళ హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురు ప్రార్థనతో యాగం ప్రారంభమైంది. సప్తద్రవ్యమృత్యుంజయ ¬మం, ఏకాదశన్యాసపూర్వక చతుస్సహస్ర చండీ పారాయణం, నవావరణ పూజ, మహాసౌరము, ఉక్తదేవతా జపములు, దంపతీపూజ, మహా మంగళహారతి, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం ధార్మిక ప్రవచనం, కోటి నవాక్షరీ జపం, అష్టావధాన సేవ, మహా మంగళహారతి, విశేష నమస్కారములు, తీర్థ ప్రసాద వితరణం, జరగనుంది. పూర్వాంగం అనంతరం వారు యాగశాల కలియదిరిగి రుత్విజులకు అభివాదం చేశారు. ఆహుతులకు స్వాగతం పులకుతూనే సిఎం కెసిఆర్ దంపతులు మంత్రులు యాగంలో నిమగ్నమయ్యారు. అయుత చండీ మహాయాగశాల ఎరుపు వర్ణంతో శోభిల్లుతుంది. నాలుగో రోజు రుత్విజులు ఎరుపు వర్ణం వస్త్రాలను ధరించారు. ఇక తొలి రోజు పసుపు, రెండో రోజు గులాబీ, మూడో రోజు తెలుపు వస్త్రాలను సీఎం కేసీఆర్, రుత్విజులు ధరించిన విషయం విదితమే. ఇవాళ ఏకాదశన్యాసపూర్వక చతుస్సహస్ర చండీ పారాయణ కొనసాగించారు. అలాగే కుంకుమార్చనలు నిలిపివేశారు. శనివారం కూడా సెలవుకావడంతో అయుత చండీమహాయాగం కనులపండువగా సాగింది. వేద మంత్రోచ్ఛారణలు, పారాయణాలు, భక్తుల జయజయధ్వానాలతో ఎర్రవల్లిలోని యాగప్రాంగణం మార్మోగింది. వివిధ రకాల పూలతో యాగస్థలిని అందంగా తీర్చిదిద్దారు. గవర్నర్ నరసింహన్ దంపతులు నాలుగోరోజు రెండోసారి యాగంలో పాల్గొన్నారు. ఐదోరోజు యాగంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై గవర్నర్ నరసింహన్… సీఎం కేసీఆర్‌తో చర్చించారు. చండీయాగంకు తమిళనాడు గవర్నర్ కొణిజేటీ రోశయ్య హాజరయ్యారు. రోశయ్యకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎదురెళ్లి ఆహ్వానించారు. యాగశాలలో సీటుపై ఆసీనులైన రోశయ్య యాగాన్ని వీక్షించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ యాగానికి హాజరయ్యారు. పవార్ యాగశాల ప్రాంగణంకు చేరుకోగానే సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా ఎదురు వెళ్లి ఆహ్వానం పలికారు. పుష్పగుచ్చం ఇచ్చి సాధరంగా ఆహ్వానించారు. శరద్ పవార్ వెంట మాజీ మంత్రి గీతారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు ఉన్నారు. పవార్‌తోపాటు ఇతర నేతలు యాగశాలలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనను వేణుగోపాలాచారి దగ్గరుండి తోడ్కొని వచ్చారు. కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లినపుడు స్వయంగా శరద్ పవార్ నివాసానికి వెళ్లి చండీ యాగానికి హాజరుకావాలని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆయన ఆహ్వానం మేరకు యాగానికి వచ్చారు. ఇక ప్రత్యేక ప్రతినిధి డిఎస్ ఇతరుల కూడా వచ్చారు. అయుత చండీ మహాయాగం ఏర్పాట్లను మంత్రి హరీష్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులపై అధికారులతో సవిూక్షిస్తున్నారు. ఇక తొలి మూడు రోజులు మమూలు వస్త్రాధారణలో కనిపించిన హరీష్‌రావు శనివారం అందరిలాగే ఎరుపు వర్ణం వస్త్రాలు ధరించారు. ఎర్రటి ధోతి ధరించారు. ఇక వాకీటాకీతో పరిస్థితులపై అధికారులను హరీష్ ఆరా తీస్తున్నారు. యాగానికి వచ్చే ప్రముఖులకు స్వాగతం పలుకుతూ.. యాగశాల వద్దకు తీసుకెళ్తున్నారు. ఇక సీఎం కేసీఆర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. పరిస్థితులు తెలియజేస్తున్నారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. వారి సౌకర్యాలపై పోలీసులతో సవిూక్షిస్తున్నారు. యాగాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో మంత్రి హరీష్‌రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయుత చండీ మహాయాగానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల సంఖ్య అధికమవడంతో కుంకుమార్చన కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. చివరి రెండు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో రెండు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఇక ఎర్రవల్లిలో మూడు కిలోవిూటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఎర్రవల్లికి వచ్చే దారులన్నీ కిక్కిరిసిపోయాయి.
జాతరను తలపించిన ఎర్రవల్లి
ప్రజాసంక్షేమం కోసం కేసీఆర్ తలపెట్టిన అయుత చండీ మహా యాగాన్ని దర్శించుకునేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో ఎర్రవల్లి ప్రాంతం జాతరను తలపిస్తోంది. సీఎం వ్యవసాయ క్షేత్రం ఎర్రవెల్లిలో యాగం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో ఎర్రవెల్లి గ్రామంలో జాతర వాతావరణం నెలకొంది. నాలుగో రోజు శనివారం కూడా యాగాశాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ కారణంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. యాగాన్ని వీక్షించేందుకు భక్తుల కోసం మరో రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మరోపక్క బందోబస్తును పోలీసులు రెట్టింపు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు పరిస్థితిని సవిూక్షిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు రెండు దర్శన క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులకు సహకరిస్తున్నారు. డీజీపీ యాగశాల వద్దే ఉండి భద్రతా దళాలను పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్
నిర్వహిస్తోన్న ఈ యాగం చాలా ఆద్యాత్మిక వాతావరణంలో కొనసాగుతోందని పలువురు భక్తులు విూడియాతో అన్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం సీఎం ఈ యాగాన్ని తలపెట్టాడంటే కొనియాడదగిన విషయమన్నారు. కేసీఆర్ మరో ఇరవై ఏళ్లపాటు రాష్ట్రాన్ని పాలిస్తే సుభిక్షమవుతుందని తెలిపారు.
యాగాన్ని దర్శించుకున్న ప్రముఖులకు కెసిఆర్ సత్కారం
వేద ఘోషతో జిల్లాలోని ఎర్రవెల్లిలో ఉన్న సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వర్ధిల్లుతోంది. రిత్విజుల పర్యవేక్షణలో అయుత చండీ మహా యాగం ఘనంగా కొనసాగుతోంది. యాగాన్ని వీక్షించేందుకు అయుత చండీ మహా యాగానికి తమిళనాడు గవర్నర్ రోశయ్య విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్ రోశయ్యకు శాలువా కప్పి సన్మానించారు. అమ్మవారి వద్ద నుంచి తీసుకొచ్చిన పూలమాల వేసి సత్కరించారు. అమ్మవారి వెండి ప్రతిమను అందజేశారు. ఇరువురు ఒకరికొకరు నమస్కరించుకున్నారు. అమ్మవారికి మరోసారి దండం పెట్టి రోశయ్య వెనుదిరిగారు.
యాగశాలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా విచ్చేశారు. ఆయనకు సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ శరద్ పవార్‌కు శాలువా కప్పి సన్మానించారు. అమ్మవారి వద్ద నుంచి తెచ్చిన పూలమాల వేశారు. అమ్మవారి వెండి ప్రతిమను బహుకరించారు. దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ యాగశాలకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ దంపతులు ఎన్వీ రమణ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. అమ్మవారి వద్ద నుంచి తెచ్చిన పూలమాల వేసి సత్కరించారు. అమ్మవారి వెండి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు.