కేవలం చదువుకోవాలనుకుంటేనే అమెరికాకు రండి
` ఇక్కడికి వచ్చి చదువును వదిలేయడం.. క్యాంపస్‌లను ధ్వంసం చేయడం వంటివి చేయకూడదు
` విద్యార్థి వీసా దరఖాస్తులను ప్రారంభించి అగ్రరాజ్యం
వాషింగ్టన్(జనంసాక్షి):విదేశీ విద్యార్థులు చదువుకొనేందుకు వీసా దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించినట్లు అమెరికా ప్రకటించింది.ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని.. కానీ, అభ్యర్థులు ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలని హెచ్చరించింది. ఈమేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి మిగ్నాన్ హౌస్టన్ కీలక ప్రకటన చేశారు. ‘’మా విద్యార్థి వీసా అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి. కానీ, వారికి ఒక్క విషయం అర్థమయ్యేలా చెప్పాలనుకొంటున్నాం. వారు ఎందుకైతే అప్లికేషన్ పెట్టుకొన్నారో దానికే ఆ వీసాను వాడుకోవాలి. అంతేకానీ.. ఇక్కడికి వచ్చి వారు చదువును వదిలేయడం.. క్యాంపస్‌లను ధ్వంసం చేయడం వంటివి చేయకూడదు.మా ప్రభుత్వం ప్రతి నిర్ణయం జాతీయ భద్రతను దృష్టిలోపెట్టుకొని తీసుకొంటుంది. వలస చట్టాల ఆధారంగా ఈ పాలసీలను నిర్ణయిస్తాం. అమెరికా ఇమిగ్రేషన్ అత్యున్నత ప్రమాణాలతో ఉండేలా చూస్తాం. ఇవి కేవలం మా పౌరులను రక్షించడానికే కాదు.. వారితోపాటు చదువుకొనే ఇతర విద్యార్థులను కాపాడటానికి కూడా అవసరం’’ అని హౌస్టన్ తేల్చిచెప్పారు.దాదాపు నెల రోజల సస్పెన్షన్ తర్వాత జూన్ 18న విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకొనేందుకు అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చామని విదేశాంగశాఖ ప్రకటించింది. సోషల్ మీడియా వెట్టింగ్ ప్రాసెస్ కోసం కొన్నాళ్లు దీనిని నిలిపేసిన విషయం తెలిసిందే. కొత్త దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నింటిలో కచ్చితంగా ‘పబ్లిక్ వ్యూ’ ఆప్షన్‌ను యాక్టివేట్ చేయాలని అమెరికా సూచించింది. దీనిని పాటించకపోతే అప్లికేషన్ తిరస్కరిస్తామని.. అలాంటి వారు తర్వాత కూడా అమెరికాకు వచ్చే అవకాశం ఉండదని తేల్చిచెప్పింది.మరోవైపు విద్యార్థి వీసాలకూ పరిమిత కాల గడువు విధించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదనలు చేసింది. దీంతో విదేశీ విద్యార్థులకు కొత్త గుబులు పట్టుకుంది. ఎఫ్-1, జె-1 వీసాలపై అమెరికాలో ఉన్న ఉంటున్న వారి మీద దీని ప్రభావం పడనుంది. దీంతో గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను సమీక్షించేందుకు ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ విభాగానికి పంపించారు.