.ప్రజాపోరాటాలతోనే కాలుష్య పరిశ్రమలను తరిమికొట్టాలి
పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నిపుణులు లేరు
పర్యవేక్షణ, పరిశోధనలు కరువై పరిశ్రమలకు అనుమతులిస్తున్నరు
ఇథనాల్ కంపెనీలను ప్రోత్సహించడమంటేనే అది అశాస్త్రీయమైన విధానం
శాస్త్రవేత్త, డాక్టర్ బాబురావు కీలక వ్యాఖ్యలు
రెండు జీవనదులున్నా పాలమూరు రైతులు అల్లాడుతున్నారు : ప్రొఫెసర్ హరగోపాల్
దశాబ్దాలుగా జిల్లాపై కొనసాగుతున్న వివక్షపై రాష్ట్రస్థాయి సదస్సు
హైదరాబాద్(జనంసాక్షి):
లాభదాయకమైన పరిశ్రమలే అయితే ఇథనాల్ కంపెనీలకు అనుమతులిచ్చినా ఎందుకు ఏండ్ల తరబడి వాటిని ప్రారంభించడం లేదని, బడాబడా పెట్టుబడిదారులు పర్మిషన్లు తీసుకున్నప్పటికీ వాటిని వెంటనే ఎందుకు పెట్టడం లేదని శాస్త్రవేత్త, డాక్టర్ బాబురావు ప్రశ్నించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల గురించి ప్రమోషన్లు చేస్తున్నారు తప్పితే ప్రశ్నించేవారు కరువయ్యారని చెప్పారు. ఇథనాల్ ఫ్యాక్టరీల పద్ధతులు అశాస్త్రీయంగా ఉన్నాయని చెబితే ఎవరూ వినేపరిస్థితుల్లో లేరని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోనూ సైంటిస్టులు, నిపుణులు సరైనవారు లేరని వివరించారు. ఆ బోర్డు దాని పనిని అది సరిగ్గా చేయకపోవడం వల్ల ప్రజలు దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజా పోరాటాల ద్వారానే కాలుష్య పరిశ్రమలను తరమికొట్టాలని పిలుపునిచ్చారు.
‘సాగునీటి లేమి కరువు కాటకాలు వలసలు విస్థాపన ఎంతకాలం? మహబూబ్‌నగర్ ప్రజలకు జననమే కానీ గౌరవ జీవనం అవసరం లేదా?’ అనే అంశంపై పాలమూరు అధ్యయన వేదిక (పీఏవీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలువురు ప్రజాస్వామికవాదులు, మేధావులు, పౌర హక్కుల సంఘాల నేతలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయాలూ, వివక్షా రూపాలను వక్తలు విపులంగా వివరించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త బాబురావు మాట్లాడుతూ.. భారతదేశానికి పెట్రోల్ వనరులే లేవని, ఇప్పటికే 86శాతంతో దిగుమతి చేసుకుంటున్నట్టు తెలిపారు. అందులో 20శాతం మాత్రమే వినియోగిస్తూ దేశానికి చాలా ఆదాయం కల్పిస్తున్నామని ప్రకటించుకోవడంలో అర్థం లేదన్నారు. ఇథనాల్ పరిశ్రమల విషయంలో అశాస్త్రీయ విధానాలే కొనసాగుతున్నాయని, కేవలం వెనుకబాటుతనం ఉన్న నారాయణపేట, గద్వాల జిల్లాలో ఎందుకు పరిశ్రమలు వస్తున్నాయని ప్రశ్నించారు. నీటి వనరులు ఉన్నచోట ఇథనాల్ కంపెనీలు పుడుతున్నాయని, ఉన్న నీరే తక్కువగా ఉన్నప్పుడు ఫ్యాక్టరీలకు ఎలా వినియోగిస్తారని అన్నారు. ఉద్యమాలకు ప్రధాన కారణం కూడా నీరు లేనప్పుడు ఫ్యాక్టరీలకు ఎలా తరలిస్తారని రైతాంగం ఆందోళనకు దిగుతోందన్నారు. ప్రభుత్వ వ్యవస్థల్లోనూ నిపుణుల కమిటీలకు సైన్సు తెలియకపోవడం లేదా దాచిపెట్టడం వల్ల ప్రజానీకానికి నష్టం వాటిల్లుతోందన్నారు.
పాలమూరు అధ్యయన వేదిక గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు పాలమూరు జిల్లాకు అనేక హామీలు గుప్పించి, అధికారంలోకి రాగానే అన్నీ మరిచిపోతున్నాయని, పైగా వారే అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నారని చెప్పారు. వెనుకబడిన ఉమ్మడి జిల్లాను ముక్కలు చెక్కలుగా చేసి మరింత సంక్షోభంలోకి నెట్టారన్నారు. రెండు జీవనదులున్నప్పటికీ ప్రజలు అల్లాడుతున్నారని, ఆర్డీఎస్‌ను ఆధునీకరించాలంటే మీనమేషాలు లెక్కిస్తున్నారని గుర్తుచేశారు. నెట్టెంపాడు ఎత్తిపోతల కింద కాలువలు లేక రైతులు పొలాలు కోల్పోతున్నారని, పాలమూరు ఎత్తిపోతల పథకాన్నీ పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. పాలకులు మొత్తం విద్రోహ పనులే చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి పాలమూరుకు నీళ్లే లేకుండా చేయడాన్ని తీవ్రంగా నిలదీశారు. అందుకే మహబూబ్‌నగర్ ఇంకా ప్రశ్నిస్తోందన్నారు. ప్రజలను నమ్మిస్తూ ఇథనాల్ ఫ్యాక్టరీలను తేవాలని చూస్తున్నారని, ఈ క్రమంలో రైతులను కూడా అరెస్టు చేసి వేధింపులకు గురిచేస్తున్న పాలకులు ప్రజలవైపు నిలుస్తున్నారో లేదో మననం చేసుకోవాలన్నారు.
ఐక్యంగా వెళ్తే సమస్యలన్నీ దూరం
` ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం
పాలమూరు అధ్యయన వేదిక చేస్తున్న ప్రజాపోరాటాలను, కార్యక్రమాలను అభినందనీయం. వాళ్ల త్యాగం మామూలుది కాదు. భవిష్యత్తులో మరింత కృషి చేయాల్సి ఉంది. అన్ని సంఘాలు సహకారంతో మాస్ లైన్‌తో ఐక్యంగా ముందుకెళ్లాలి. అప్పుడే పాలమూరు జిల్లాల్లో సమస్యలు దూరమవుతాయి. ఏడాదిలోపే దీని మార్పు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించి అడుగేయాల్సిన తరుణమిది.
ప్రశ్నించకుండా అభివృద్ధి చర్చ చేయలేం
` ఎన్ వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్
ప్రజల మౌలిక అభివృద్ధి సాధ్యమైందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్నించుకోవాలి. అదే అభివృద్ధికి కొలమానంగా భావించాలి. అసలు విద్యా, వైద్యం అందుతుందా? ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పడుతున్నాయా అన్నది ఆలోచించాలి. అభివృద్ధి అనే అంకెల గారడీలో పడితే చాలా చిక్కుల్లో ఉన్నట్టే. రోడ్లు వస్తే పురోగతి సాధించినట్టు కాదు. ప్రజల మౌలిక అభివృద్ధి సాధ్యమైందా లేదా అన్నది పరిశీలించాలి. ప్రజలు కోరుకున్నట్టు జరుగుతోందా లేక కార్పొరేట్లు ఆశించినట్టు పనులు సాగుతున్నాయా అన్నది బేరీజు వేయాలి. మహబూబ్‌నగర్‌కు వచ్చిన ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల తలసరి ఆదాయం పెరిగిందనే భావన కూడా కల్పిస్తారు. కాబట్టి ప్రశ్నించకుండా అభివృద్ధి చర్చ చేయలేం. ఈ నిర్వచనాన్ని పునరాలోచించాలి. దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంలో గట్టు మండలం నిలవడం దేనికి సంకేతం..?
పాలమూరు ప్రజలకు పోరాడే శక్తి ఉంది
` జ్యోతి, చైతన్య మహిళా సంఘం నాయకురాలు
పాలమూరు జిల్లాకు విద్యా, వైద్యం అందిందా అంటే అదీ లేదు. అయినప్పటికీ పాలమూరు ప్రజలకు ఏండ్ల తరబడి సమస్యలపై ఎదురించి పోరాడే శక్తి ఉంది. ఈ ప్రాంతం వెనుకబాటుతనంలో కొట్టుమిట్టాడం వల్ల పాలకులకు విపరీతమైన నిర్లక్ష్యమూ ఉంది. ఇక్కడి ప్రజలు ప్రశ్నించలేరని అనుకుంటున్నారు. పాలకులే ఉద్యమాల్లో వ్యక్తులను దూర్చి నిర్వీర్యం చేస్తున్నారు. డబ్బులు తీసుకుని ఉద్యమాలకు పురమాయించడం దారుణం. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. పెద్దధన్వాడ ప్రజలు చూపిన చైతన్యం పోరాటాలకు ఆదర్శం. ఇందులో యువత పాత్ర చాలా కీలకంగా మారింది.
రైతులకు పౌరసమాజం అండగా నిలవాలి
` ఎంఎం రహమాన్, జనంసాక్షి ఎడిటర్
ఉమ్మడి పాలమూరు జిల్లా విషయంలో పాలకుల నిర్లక్ష్యం వెంటాడుతోంది. సమస్యలు తీర్చాలని వేడుకుంటే కొత్త సమస్యలు తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా ప్రశ్నించకపోతే భవిష్యత్ తరాలకు మరింత కష్టం. పాలకులను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పెద్ద ధన్వాడ రైతులకు పౌర సమాజం అండగా నిలవాలి.
ఇంకెంత కాలం ఈ నిర్లక్ష్యం : రాఘవా చారి, పాలమూరు అధ్యయన వేదిక
పాలకపార్టీలు కక్షగట్టినట్టు పాలమూరుపై దశాబ్దాలుగా వివక్ష చూపాయి. ఇక్కడి ప్రజలకు జీవించే హక్కులేదా? ఎల్లకాలం ఈ వలసలకు ఉమ్మడి జిల్లా బలి కావాల్సిందేనా? దీన్ని సహించడానికి ఇకపై ప్రజలు సిద్ధంగా లేరు. పాలకులూ, ఇకనైనా మారండి. రాజ్యాంగ హక్కులను గౌరవించే పార్టీలు ఏవైతే ఉన్నాయో.. ఆ పార్టీలు ప్రజాపక్షాన నిలబడకపోతే చరిత్ర క్షమించదు.
ఇప్పటికీ కరువూ కాటకాలు : ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, సీఎల్‌సీ తెలంగాణ అధ్యక్షుడు
ఒక జిల్లాకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించేందుకు వేదికను ఏర్పాటు చేయడం అభినందనీయం. నీటి లేమి, కరువు కాటకాలు, కనీస వసతులు కరువైన పాలమూరు జిల్లాలో వలసలు కొనసాగడం బాధాకరం. భూములను ఆక్రమించుకుంటూ ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు కడుతుంటే సారవంతమైన భూములు కోల్పోతున్నాం. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన జిల్లా గురించి ఇకనైనా పట్టించుకోవాలి. లేకపోతే గౌరవ ప్రదమైన జీవనం ప్రశ్నగానే మిగిలిపోతుంది.
రైస్ మిల్లు పెడతామని చెప్పి పెద్దపెద్ద రోడ్లు వేశారు
` రామచంద్రయ్య, చిత్తనూరు ఇథనాల్ వ్యతిరేక పోరాట ఉద్యమకారుడు
రైస్ మిల్లు పెడతామని చెప్పి పెద్దపెద్ద రోడ్లు వేశారు. తర్వాత విషయం తెలుసుకున్న పోరాటాలు మొదలయ్యాయి. గ్రామగ్రామానా అవగాహన చేపట్టాం. కొందరు నాయకులు డబ్బులకు అమ్ముడుపోయి ఇథనాల్ కంపెనీకి సహకరించారు. వంద రోజులకుపైగా పోరాటం చేసినా అంగ బలం, అర్ధబలంతో కంపెనీ ప్రారంభించారు. ఆ కాలుష్య ప్రభావంతో దగ్గూదమ్ముతో పాటు అనేక ఇబ్బందులొస్తున్నాయి. కిలోమీటర్ల దుర్వాసన వెదజల్లుతోంది. ప్రభుత్వం మారినప్పటికీ మా సమస్య తీరలేదు.
ఈ కార్యక్రమంలో ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ డి నర్సింహారెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె లక్ష్మీ నారాయణ, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవా చారి, పీఏవీ మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ కె వెంకటేశ్వర్లు, నాయకులు తిమ్మప్ప, గద్వాల జిల్లా కన్వీనర్ ఎండి ఇక్బాల్ పాషా, గద్వాల జిల్లా కో కన్వీనర్ డి హన్మంతు, వనపర్తి జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, శాంతన్నతో పాటు పలువురు రైతులు, మేధావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీపై ఇక్బాల్ రచించిన పాటను వేదికపై ఆవిష్కరించారు.