జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్‌ సాధించేవరకు పోరుఆగదు

` కేంద్రంలో అధికారంలోకి వస్తాం..దేశాన్ని రక్షిస్తాం
` దేశ ఆర్థిక పరిస్థితిని మోదీ చిన్నాభిన్నం చేశారు
` 11 ఏళ్లలో తెలంగాణకు ఆయన చేసింది శూన్యం
` అబద్ధాల ప్రచారంలో సిద్ధహస్తుడు
` భారత్‌`పాక్‌ ఘర్షణలో అమెరికా జోక్యంపై మౌనమెందుకు?
` విదేశీలు చుట్టే మోడీకి..మణిపూర్‌ వెళ్లే తీరిక లేదు
` ఆ రాష్ట్రం ఈ దేశంలో భాగం కాదా?
` ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం
` కాంగ్రెస్‌ సామాజిక న్యాయ సమరభేరి సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినట్లే.. కేంద్రంలో సైతం కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువు తీరుతుందని ఏఐసీసీ అధ్యక్షులు, ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. దేశరక్షణ కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమని ఆయన పురుద్ఘాటించారు. విదేశాలు తిరుగుతున్న మోడీ, మణిపూర్‌కు మాత్రం ఇప్పటి వరకు వెళ్లలేదని అన్నారు.శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభలో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. దేశానికి ప్రధాని మోదీ, కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా చాలా చాలా చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కానీ వాళ్లు ఈ దేశానికి, తెలంగాణకు చేసిందేమిటని సూటిగా ప్రశ్నించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ 42 దేశాలు తిరిగారని గుర్తు చేశారు. కానీ ప్రజలు చనిపోతున్నా.. మణిపూర్‌ మాత్రం ఆయన వెళ్లలేదని మండిపడ్డారు. పాకిస్థాన్‌ను ఏదేదో చేస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించార న్నారు. కానీ ఎందుకు ఏం చేయలేదని మోదీ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. పాకిస్తాన్‌పై యుద్ధం చేయకుండా.. మిమ్మల్ని ఎవరు ఆపారంటూ సందేహం వ్యక్తం చేశారు. పలహ్గాం ఘటన తరవాత ఆపరేషన్‌ సింధూర్‌కు కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించిందని గుర్తు చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ చిన్నాభిన్నం చేశారు. పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలని ’ఆపరేషన్‌ సిందూర్‌’కు రాహుల్‌గాంధీతో పాటు కాంగ్రెస్‌ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చింది. మరి మోదీ ఎందుకు యుద్దాన్ని మధ్యలోనే ఆపేశారు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ చేయగానే యుద్ధం ఆపేశారు.. కానీ ఆ విషయంపై ప్రధాని నోరు విప్పరు. మణిపుర్‌ ఈ దేశంలో భాగం కాదా? మణిపుర్‌ వాసులు భారతీయులు కాదా?అఖిలపక్ష సమావేశానికి ప్రధాని రాలేదు.. బిహార్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్నారు‘ అని ఖర్గే విమర్శించారు. ప్రధాని మోదీలాగా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు భయపడ లేదన్నారు. ఎవరు వచ్చినా బంగ్లాదేశ్‌కు స్వాతంత్యర్ర కల్పిస్తామని ఇందిరాగాంధీ ప్రకటించారని.. అదే పని ఆమె చేసి చూపించారన్నారు. క్షమాపణలు చెప్పడమే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల పని అంటూ అయన ఎద్దేవా చేశారు. రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తీసి వేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు. సెక్యులర్‌ అనే పదం రాజ్యాంగంలోనే లేదని బీజేపీ చెపుతుందన్నారు. ªూజ్యాంగం నుండి లౌకిక పదాన్ని తీసేయారని తాను చాలెంజ్‌ చేస్తున్నానని ఈ సందర్భంగా ఖర్గే ప్రకటించారు. సెక్యులర్‌ అనే పదం బీజేపీ ప్రణాళికలో రాసుకున్నారని వివరించారు. సెక్యులర్‌ అనే పదంతో విూకు ఇబ్బంది ఉంటే విూ పార్టీ ప్రణాళిక నుంచి తీసివేయాలని బీజేపీ అగ్రనేతలకు ఖర్గే బహిరంగ సవాల్‌ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందంటే.. అది కార్యకర్తల కృషి ఫలితమేనని స్పష్టం చేశారు. రేవంత్‌, భట్టి, మంత్రులు కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం కృషి చేశారన్ని వివరించారు. కేసీఆర్‌, బీజేపీ కలిసి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అడ్డుకుంటున్నారన్నారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఈ రెండు పార్టీలను ఓడిరచారని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని గతంలో తాను చెప్పానని వివరించారు. కాంగ్రెస్‌ హయాంలోనే తెలంగాణలో 50కిపైగా కేంద్ర సంస్థలు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణకు ఈ 11 ఏళ్లలో ఏం ఇచ్చారంటూ ప్రధాని మోదీని ఈ సందర్భంగా ఖర్గే సూటిగా ప్రశ్నించారు. గతంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులను కేసీఆర్‌ మోసం చేశారు. ప్రధాని మోదీ, అమిత్‌షా అబద్దాలు చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. హైదరాబాద్‌కు మోదీ చేసింది శూన్యం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం అందిస్తోంది. రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో రూ.8,200 కోట్లు జమ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హావిూలను నెరవేరుస్తోంది. గిగ్‌ వర్కర్ల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొస్తోంది. దేశంలో తొలిసారి కులగణన చేపట్టింది తెలంగాణ ప్రభుత్వమే. బీసీల రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తోందన్నారు.

2.మాది రైతురాజ్యం
` బీఆర్‌ఎస్‌,భాజాపాతో చర్చకు సిద్ధం
` ఢల్లీిలో ఉండే మోడీ.. ఉండే కెడీ అయినా ఒకే..
` కాంగ్రెస్‌ ప్రభుత్వం మూణ్నాళ్ల ముచ్చటే అన్నారు..
` అపోహలను పటాపంచలు చేశాం
` కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ
` ఏడాదిలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం
` ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత మాదే: సీఎం రేవంత్‌
హైదరాబాద్‌,జులై (జనంసాక్షి):ఢల్లీిలో ఉండే మోడీ అయినా, గల్లీలోని కేడీ అయినా.. రైతు సంక్షేమం విషయంలో తేల్చుకునేందుకు రండి, సవాళ్లకు సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలకు గట్టి సవాల్‌ విసిరారు. కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసి, వ్యవసాయాన్ని దండుగ నుంచి పండుగగా మార్చిన ఘనత తమదంటూ రేవంత్‌ రెడ్డి గర్వంగా వెల్లడిరచారు. 24 గంటల ఉచిత కరెంట్‌, రుణమాఫీ సహా రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసి తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు. ఇచ్చిన హావిూ మేరకు ఏడాదిలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. ఇది కాదని నిరూపించ గలరా అని సవాల్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభలో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ నేపథ్యంలో రైతుల శ్రేయస్సు కోసం చేసిన పనులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలకు రేవంత్‌ సవాల్‌ చేశారు. రైతుల బాగు కోసం ఎవరు ఎంత చేశారో తేల్చుకునేందుకు రావాలని కోరారు. రైతుల కోసం 18 నెలల్లో రూ.1.04లక్షల కోట్లు ఖర్చు చేశాం. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనని గత సీఎం చెప్పారు.. 2.80 కోట్ల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం పండిరచి దేశానికే ఆదర్శంగా నిలిచాం. రైతుభరోసాలో ప్రభుత్వం విఫలమవుతుందని కొందరు ఎదురు చూశారు.. కానీ వారి ఆశ నెరవేరలేదు. రైతు రాజ్యం ఎవరు తెచ్చారో.. ఎక్కడైనా చర్చ చేసేందుకు సిద్ధం. చర్చకు ఎవరొస్తారో రండి.. కేసీఆర్‌, మోదీ, కిషన్‌రెడ్డి.. ఇలా ఎవరొచ్చినా సరే. కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నా.. పేదలు ఎప్పుడూ బర్రెలు, గొర్రెలు మేపుతూనే బతకాలా?కేసీఆర్‌, మోదీకి సవాల్‌ విసురుతున్నా. లెక్క కావాలంటే చెప్పండి.. అందర్నీ తీసుకొచ్చి స్టేడియంలో నిలబెట్టి లెక్కవేయిస్తా. 60వేలకు ఒక్కరు తక్కువ వచ్చినా కాళ్లు మొక్కి తప్పుకొంటా‘ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు, పథకాలను అమలు చేస్తోందన్నారు. అనేక కష్టాలు ఎదురైనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నిలబడి, సమస్యలను అధిగమించి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించే దిశగా పనిచేస్తోందన్నారు. ఈ క్రమంలో తెలంగాణ రైతులు ఈ ఏడాది 2 కోట్ల మెట్రిక్‌ టన్నుల రైస్‌ను ఉత్పత్తి చేసినట్లు సీఎం గుర్తు చేశారు. ప్రజా పాలనలో ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు సరైన ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కేవలం 9 రోజుల వ్యవధిలో రూ. 9 వేల కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రైతులకు ఆర్థిక భరోసాను అందించడమే కాకుండా, వ్యవసాయాన్ని ఒక పండుగగా మార్చిందని రేవంత్‌ రెడ్డి తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ సరఫరా చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయం, రైతు సంక్షేమం, ఆర్థిక పునరుద్ధరణ కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. మూడు రంగుల జెండా చేతబూని కల్వకుంట్ల గడీని బద్దలు కొట్టామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రతి గుండెను తడుతూ ప్రజాపాలన సాగిస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ సీట్లు పెరగబోతున్నాయని.. మహిళలకు రిజర్వేషన్లు అమలు కానున్నాయని చెప్పారు. కార్యకర్తలకు అన్ని పదవులు దక్కే వరకూ విశ్రాంతి తీసుకోబోనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తామని.. దాని కంటే ఒక్క సీటు తక్కువ వచ్చినా తనదే బాధ్యతని చెప్పారు. ‘కాంగ్రెస్‌ నేతలు కలిసి ఉండలేరని.. ఈ పాలన మూణ్నాళ్ల ముచ్చటే అని కొందరు అన్నారు. కానీ.. పార్టీ నేతలంతా ఐకమత్యంతో పనిచేస్తూ ఆ అపోహలను పటాపంచలు చేశారు. జనగణనతో పాటు కులగణన.. ఎస్సీ వర్గీకరణ చేస్తామని గతంలో రాహుల్‌గాంధీ మాటిచ్చారు. హావిూ ఇచ్చినట్టుగానే ఏడాదిలోపే కులగణన, ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం. 18 నెలల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ మోడల్‌ ఆవిష్కరించాం. కష్టాలు, ఒడిదొడుకులు వచ్చాయి.. అన్నీ అధిగమించి ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతోపాటు అనేక మంది కాంగ్రెస్‌ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కొత్త,పాత తేడాలేదు..
` చేరాక అందరూ సమానమే..
` అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలి
` గాంధీభవన్‌ పీఏసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే
` తెలంగాణలో వచ్చే పదేళ్లు మనదే అధికారం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): పార్టీలో అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. కొత్తపాత తేడా వద్దని.. త్వరలో అన్ని కమిటీల నియామకం పూర్తిచేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణం, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక, స్థానిక ఎన్నికలపై గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశమైంది. తొలుత పాశమైలారం ఘటనపై నేతలు సంతాపం తెలిపారు. అనంతరం బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై చర్చించారు. జై బాపు-జై భీమ్‌-జై సంవిధాన్‌ కార్యక్రమాలపై సమాలోచనలు చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ పార్టీకి సంబంధించిన అంశాలపై బయట ఎలాంటి విమర్శలు చేయొద్దని.. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ సమన్వయం చేయాలని దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా మంత్రులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని సీఎం వ్యాఖ్యానించారు. సీనియర్‌ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ కొత్త, పాత నేతల మధ్య సమన్వయం లేదన్నారు. కొత్తగా వచ్చినవారు పాతవారితో కలిసి వెళ్తే పార్టీ బలం పెరుగుతుందని చెప్పారు.
తెలంగాణలో వచ్చే పదేళ్లు మనదే అధికారం: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ పదవులను నేతలు సాధారణంగా తీసుకోవద్దని.. వాటితోనే గుర్తింపు, గౌరవం వస్తుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.రాజకీయాల్లో ఎదిగేందుకు అవి ఉపయోగపడతాయని చెప్పారు. గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో వచ్చే పదేళ్లు మన పార్టీయే అధికారంలో ఉంటుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ‘’నేను పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు 45 లక్షల సభ్యత్వాలు చేశాం. యూత్‌ కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ విభాగాల వారితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి ప్రభుత్వంలో పదవులు వచ్చాయి. రానున్న రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ సీట్లు పెరగబోతున్నాయి. మహిళా రిజర్వేషన్‌, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయి. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలి. నాయకులుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి సమన్వయంతో పనిచేయాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనలో చాలా విజయాలు సాధించాం. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలి. కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తేవాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.
90 సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం
సామాజిక న్యాయం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. చేసిన అభివృద్ధితో పార్టీ మరోసారి 90 సీట్లతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ.. సామాజిక న్యాయానికి కట్టుబడి అగ్రవర్ణాలకు చెందిన రేవంత్‌రెడ్డికి సీఎం, బీసీనైన తనకు పీసీసీ చీఫ్‌, నలుగురు దళితులకు క్యాబినెట్‌లో చోటు కల్పించిందని మహేశ్‌కుమార్‌ అన్నారు. మరో దళిత బిడ్డకు స్పీకర్‌ పదవి ఇచ్చి గౌరవించిందని చెప్పారు. కొత్తగా నియమితులైన నేతలకు పార్టీ చక్కని అవకాశం కల్పించిందని, దానిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ సామాజిక న్యాయ సమరభేరి సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభలో గ్రామస్థాయి అధ్యక్షులకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

లక్డీకాపూల్‌లో రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్‌, ఖర్గే
హైదరాబాద్‌(జనంసాక్షి):నగరంలోని లక్డీకాపూల్‌లో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు.రోశయ్య జయంతి సందర్భంగా నేతలు నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.