పరామర్శకు వచ్చిన వారితో తాజారాజకీయ పరిణామాలపై కేసీఆర్ చర్చ
హైదరాబాద్(జనంసాక్షి):సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద దవాఖానలో అడ్మిటైన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను పరామర్శించేందుకు పార్టీ నేతలు పలువురు వచ్చారు. ఈ సందర్భంలో.. వారితో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలు.. వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. కాగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఆయన కూతురు కవిత పరామర్శించారు. స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని చూసేందుకు కవిత శుక్రవారం వచ్చారు. కవిత ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. అనంతరం చికిత్స అందిస్తున్న వైద్యులతో ఆమె మాట్లాడారు. గురువారం సాయంత్రం కేసీఆర్ అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సలహాతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం వైద్య బృందం ఆయనకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. వీటిలో బ్లడ్ షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉండటం, సోడియం స్థాయిలు తగ్గినట్టు గుర్తించారు. దీనిని నియంత్రించేందుకు అవసరమైన వైద్యసహాయం అందిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంపై గురువారం రాత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ‘కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. నిశితంగా పర్యవేక్షణ కొనసాగుతోందని హెల్త్ బులిటెన్‌లో వివరించారు.
సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రికి కేసీఆర్
` మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. సాధారణ వైద్య పరీక్షల కోసం నిన్న సాయంత్రం ఆయన సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారని తెలిపారు. బ్లడ్ షుగర్, సోడియం స్థాయులు పర్యవేక్షించేందుకు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించినట్టు చెప్పారు. ఎలాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు లేవని, వైటల్స్ అన్నీ సాధారణంగానే ఉన్నాయన్నారు. కేసీఆర్ క్షేమం గురించి ఆరాతీస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గత రెండు రోజులుగా నీరసంగా ఉండడంతో కేసీఆర్ గురువారం సాయంత్రం ఆసుపత్రికి వచ్చారు. ఆయనను పరీక్షించిన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు సూచనతో ఆసుపత్రిలో చేరారు. వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు గురువారం రాత్రి 9.30 సమయంలో బులెటిన్ విడుదల చేశాయి. ‘’నీరసంతో బాధపడుతూ కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక పరీక్షల్లో రక్తంలో షుగర్ స్థాయులు అధికంగా, సోడియం స్థాయులు తక్కువగా ఉన్నట్లు తేలింది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. షుగర్, సోడియం సాధారణ స్థాయికి వచ్చే వరకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతారు’ అని హెల్త్ బులెటిన్‌లో డాక్టర్ ఎంవీ రావు పేర్కొన్నారు.