ఎరువుల సరఫరా కోసం తెలుగుదేశం ధర్నా

విజయనగరం జూన్‌ 30 : జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముఖ్యంగా ఎరువులను సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలుగుదేశం పార్టీ జిల్లా శాఖ శనివారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించింది. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఎమ్మెల్యే అశోక్‌ గజపతి రాజు , జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ నాయకత్వంలో నాయకులు , కార్యకర్తలు కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పి.ఎ.శోభకు వినతిపత్రం సమర్పించారు. విత్తనాలు ఎరువులు నిర్ణయించిన ధరకే అందించాలని, రైతు బజార్లను పటిష్టం చేయాలని, నల్ల బజారులను నిషేధించాలని, 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు అందించాలన్న 13 డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి డివిజి శంకరరావు , మాజీ మంత్రి పడాల అరుణ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి, పార్టీ నాయకులు కొండపల్లి అప్పలనాయుడు, కొండబాబు , ఐవిపి రాజు, గుమ్మడిసంథ్యారాణి తదితరులు పాల్గొన్నారు.