ఎస్‌ఐ కొట్టడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్యాయత్నం
కడప, ఆగస్టు 2 : ఎస్‌ఐ కొట్టడంతో మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, రోడ్డుపై బైఠాయించారు. ఈ సంఘటన వీరపురాయనిపల్లెలో గురువారం సాయంత్రం జరిగింది. వీరపురాయనిపల్లె మండలం ఉసిరెడ్డిపల్లెకు చెందిన గంగాప్రసాద్ రెడ్డి(32), కుమార్, రవికుమార్‌లు ముగ్గురు కలిసి ఒక మోటారు సైకిల్‌పై వెళుతుండగా ఎస్‌ఐ రోషన్ నిలిపి వారిని తనిఖీ చేశారు. మోటారు సైకిల్‌పై ముగ్గురు ఎక్కిపోతున్నందుకు కానిస్టేబుల్, గంగాప్రసాద్ రెడ్డిపై చేయి చేసుకున్నాడు. ఆ తరువాత ఎస్‌ఐ రోషన్ గంగాప్రసాద్‌రెడ్డి బూట్‌కాలితో తన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన గంగాప్రసాద్ రెడ్డి పురుగుల మందు తాగాడు. ఇది గమనించి చికిత్స నిమిత్తం పులివెందుల ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు వందల సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని దాడికి పాల్పడ్డారు. ఆందోళన కొనసాగుతూనే ఉంది.