ఏలూరులో అంతు చిక్కని వ్యాధి

share on facebook

– ఒకరి మృతి..మొత్తం 286 మందికి అస్వస్థత

– 127 మంది డిశ్చార్జ్‌

ఏలూరు,డిసెంబరు 6(జనంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారిలో ఓ వ్యక్తి మృతిచెందారు. నగరంలోని విద్యానగర్‌కు చెందిన శ్రీధర్‌ (45) ఏలూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మూర్చతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. ఈ ఉదయం ఆస్పత్రిలో చేరారు. వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వల్లే శ్రీధర్‌ మృతిచెందారంటూ అతడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నా వైద్యులు విజయవాడ తరలించలేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు శ్రీధర్‌ మృతిని వైద్యులు ఇంకా ధ్రువీకరించలేదు. ఏలూరు వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 286 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో 117 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. సాయంత్రం వరకు అందరి ఆరోగ్య పరిస్థితీ నిలకడగానే ఉన్న నేపథ్యంలో మూర్చ వ్యాధిలో ఆస్ప్రతిలో చేరిన శ్రీధర్‌ మృతిచెందడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. అస్వస్థతకు గల కారణాలను ఇప్పటివరకు అధికారులు, వైద్యులు నిర్ధారించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఏలూరులో రేపు ప్రత్యేక వైద్యబృందాలు పర్యటించనున్నాయి. మరోవైపు సీఎం జగన్‌ కూడా ఏలూరులో పర్యటించి వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సవిూక్ష నిర్వహించనున్నారు

అంతుచిక్కని కారణాలు..

ప్రజల అస్వస్థతకు కారణాలు మాత్రం ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. వైద్య పరీక్షలు నిర్వహించినా అన్నింటిలోనూ సాధారణ ఫలితాలే వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వైరల్‌, బ్యాక్టీరియా, కొవిడ్‌, సిటీ స్కాన్‌, నీటి నాణ్యత లాంటి అన్ని పరీక్షలు నిర్వహించినా వ్యాధి నిర్ధారణకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని అధికారులు వెల్లడించారు. వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురవుతుండడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. అస్వస్థులైన వారిని పరామర్శించేందుకు సోమవారం సీఎం జగన్‌ ఏలూరు వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రాణ నష్టం లేకుండా చూడాలి: గవర్నర్‌

వందల మంది అస్వస్థతకు గురికావడంపై రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. సమస్యకుగల కారణాలపై అధ్యయనం చేయాలని.. అవసరమైతే ఉన్నతస్థాయి నిపుణుల సలహాలు తీసుకోవాలని వైద్యశాఖను గవర్నర్‌ కోరారు.

 

Other News

Comments are closed.