ఐక్యరాజ్య సమితిలో శ్రీలంక యుద్ధ నేరాలకు వ్యతిరేకంగా ఓటువేయండి

బలమైన వాదనను వినిపించకపోతే మద్దతు ఉపసంహరిస్తాం
డీఎంకే చీఫ్‌ కరుణానిధి
చెన్నై, మార్చి 17 (జనంసాక్షి) :
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో శ్రీలంక యుద్ధనేరాలను వ్యతిరేకిస్తూ భారత్‌ ఓటు వేయాలని, లేనిపక్షంలో యూపీఏకు మద్దతు ఉపసంహరిం చుకుంటామని డీఎంకే చీఫ్‌ కరుణానిధి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ చైర్సన్‌ సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ నెల 22న జెనివాలో జరిగే ఐక్య రాజ్యసమితి మానవ హక్కు మండలి సమావేశంలో జరిగే ఓటింగ్‌లో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయనిపక్షంలో తమ మంత్రులు వైదొలుగుతారని పేర్కొన్నారు. యూపీఏకి తమ మద్దతు సందేహమేనని ఆయన అన్నారు. శ్రీలంకలో యుద్ధ నేరాలకు పాల్పడిన వారిపై నిర్ణీత కాలావధిలో తగిన చర్యలు తీసుకోవడం, యుద్ధ నేరాలపై అంతర్జాతీయ దర్యాప్తు జరపాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వ తీర్మానాల్లో చేర్చాలని కరుణానిధి డిమాం డ్‌ చేశారు. రెండు రోజుల్లో ఆయన రెండుసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే విషయమై హెచ్చరించారు. శ్రీలంకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేయవచ్చు అంటూ ఆర్థిక మంత్రి చిదంబరం శని వారంనాడు సూచనప్రాయంగా చేప్పినప్ప టికీ కరుణానిధి రెండవసారి హెచ్చరిక స్వరం వినిపించడం ఇది రెండవసారి సోమవారం నుంచి తమిళనాడులో విద్యార్థులు పెద్ద ఎత్తున శ్రీలంకకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిదంబరం ఈ ప్రకటన చేశారు. శ్రీలంకకు వ్యతిరేకంగా భారత్‌ ఓటు వేస్తుందన్న   విశ్వాసం తనకు ఉందని ఇదే విశ్వాసాన్ని విద్యార్థుల్లో కూడా నింపాలని ఆయన కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం శ్రీలంక తమిళుల అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ప్రధాని అన్ని కోణాలను పరిశీలిస్తారని పీఎంవో కార్యాలయ మంత్రి నారాయణస్వామి చెప్పడమే తప్ప మరిఎలాంటి స్పంద లేదు. 18 మంది ఎంపీలతో డీఎంకే పార్టీ యూపీఏ కూటమిలో రెండవ అతిపెద్ద భాగస్వామిగా ఉంటూ ప్రభుత్వానికి కీలక మద్దతుదారుగా నిలిచింది.