ఐటీడీఏకు రూ.25 కోట్లు మంజూరు

ఆదిలాబాద్‌, ఆగస్టు 3 : ఐటీడీఏ పరిధిలోని వివిధ భవనాల నిర్మాణం కోసం సమగ్ర కార్యాచరణ పథకం కింద 25 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు నిధులతో భవనాలను , అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఉట్నూరు మండలం లాల్‌టేకిడిలో 3 కోట్ల రూపాయలతో బీఈడీ కళాశాల భవనం, రూ.13 కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్‌ కళాశాలల భవనాన్ని నిర్మించనున్నారు. 2 కోట్ల రూపాయలతో నిర్మల్‌లో బాలురు, బాలికల పోస్టుమెట్రిక్‌ కళాశాలల భవనాలు, కోటి రూపాయలతో ఇచ్చోడలో బాలికల కోసం పోస్టుమెట్రిక్‌ కళాశాల భవనాన్ని నిర్మించనున్నారు. అదే విధంగా రెండు కోట్ల రూపాయల చొప్పున ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌లలో కళాశాల భవనాలు, రూ.3 కోట్లతో బెల్లంపల్లిలో యువజన శిక్షణ కేంద్ర నిర్మాణం, చేపట్టనున్నారు. 25 లక్షల రూపాయల చొప్పున జిల్లాలోని 6 గురుకల కళాశాలలో, పాఠశాలలో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయనున్నారు. రూ.50 లక్షల చొప్పున 11 గిరిజన ఆశ్రమ పాఠశాలలో వసతులు కల్పించేందుకు వెచ్చించనున్నారు. 50 గ్రామాలలో 2 లక్షల చొప్పున పౌష్టిక ఆహార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 6 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసి 6 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేయనున్నారు.