ఒకరి దారుణంగా హత్య

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వేల్పుగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మ మల్లయ్య (48) ను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. పాల్వంచ మర్రి వద్ద గల వైన్ షాప్ సమీపంలో ఈ హత్య జరిగింది. నిమ్మ మల్లయ్యతో పాటు వరుసకు సోదరుడైన నిమ్మ రాములతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి రోడ్డుపైన దారుణంగా హత్య చేశారు.కాగా మల్లయ్య గొంతు కోయడంతో అక్కడికక్కడే మరణించగా, రాములు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మల్లయ్య కుటుంబంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూతగాదాలే హత్యకు దారి తీసినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతునికి భార్య ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు మాచారెడ్డి ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు.