కరోనా కొత్త స్ట్రెయిన్
బెర్లిన్,డిసెంబరు 20 (జనంసాక్షి): బ్రిటన్ సహా దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు మరోసారి కలవరంలోకి జారుకుంటున్నాయి. తాజాగా ఆ రెండు దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధాజ్ఞలు విధించేందుకు జర్మనీ ప్రభుత్వం పరిశీలనకు దిగింది. ఆయా దేశాల్లో కరోనా కొత్త రకం స్ట్రెయిన్ విజృంభణ కొనసాగుతున్నందున.. అక్కడి నుంచి వచ్చే విమానాలపై జర్మనీ దృష్టి సారించింది. ఈ మేరకు జర్మనీ ఆరోగ్య అధికారులు ఓ విూడియాతో వెల్లడించారు.’బ్రిటన్‌లో స్ట్రెయిన్ విజృంభణకు సంబంధించిన తాజా పరిస్థితులను జర్మనీ నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై నెదర్లాండ్, బెల్జియం దేశాలు నిషేధం విధించాయి. దీంతో జర్మన్ ప్రభుత్వం కూడా అదే తరహా నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. ‘ అని జర్మన్ ఆరోగ్యశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, జర్మనీలో ఇప్పటివరకు కరోనా వైరస్ స్ట్రెయిన్‌కు సంబంధించిన కేసులేవీ గుర్తించలేదని ప్రముఖ వైరాలజీ విభాగ వైద్యుడు క్రిస్టియన్ డ్రోస్టెన్ వెల్లడించారు. యూకేలో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తోందంటూ.. లండన్‌లో అక్కడి ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హెన్‌కాక్ మాట్లాడుతూ.. ‘దురదృష్టవశాత్తూ కొత్త రకం స్ట్రెయిన్‌పై నియంత్రణ కోల్పోయాం.. అందుకే దక్షిణ ఇంగ్లాండ్‌లో క్రిస్మస్ వేడుకలపై కఠినంగా నిషేధాజ్ఞలు విధించినట్లు’ చెప్పారు. యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటలకే బెల్జియం, నెదర్లాండ్ దేశాలు ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించడం గమనార్హం.