కళంకిత మంత్రులు రాజీనామా చేసి విచారణకు హాజరు కావాలి

హైదారాబాద్‌, మే 27 : అవినీతి మంత్రులు రాజీనామా చేసి సీబీఐ విచారణకు హాజరు కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. మద్యం విధానాలపై తిరుపతిలో అఖిల పక్ష నేతలతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులంతా రాజీనామా చేసి ప్రజల గౌరవాన్ని కాపాడలన్నారు. అవినీతి ఆరోపణలపై అరెస్టయిన వారిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓదార్చేందుకు ఓదార్పు యాత్ర చేపట్టారని ఆయన విమర్శించారు. వైఎస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర ముగిసిపోగా, కిరణ్‌కుమార్‌ ఓదార్పు యాత్ర ప్రారంభమైందని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతిపరులను ఓదార్చడం వల్ల ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని ఆయన కిరణ్‌ను ప్రశ్నించారు.