కాంగ్రెస్‌లో చేరిన కన్హయ్యకుమార్
` రాహుల్ సమక్షంలో పార్టీలో చేరిక
దిల్లీ,సెప్టెంబరు 28(జనంసాక్షి): జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. అలాగే, గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ కాంగ్రెస్‌కు తన మద్దతు ప్రకటించారు. కొన్ని సాంకేతిక కారణాల రీత్యా ఆయన పార్టీలో అధికారికంగా చేరకపోయినప్పటికీ తన మద్దతు ప్రకటించారు. కన్నయ్య చేరికను పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు స్వాగతించారు. దేశంలో భావప్రకటన స్వేచ్ఛ కోసం పోరాటానికి కన్నయ్య కుమార్ ఓ చిహ్నమని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు.
2019 ఎన్నికల ముందు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)లో చేరిన కన్నయ్య కుమార్, తన సొంత ప్రాంతమైన బిహార్‌లోని బెగుసరాయి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. భాజపా అభ్యర్థి గిరిరాజ్ సింగ్‌తో చేతిలో ఓటమి పాలయ్యారు. గతంలో జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేసి దేశద్రోహం కేసులో కింద అరెస్టయ్యారు. అయితే, ఎన్నికల సమయంలో సీపీఐలో చేరినప్పటికీ ఆయన ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారనే వార్తలు వెలుబడ్డాయి. అందుకే పలుసార్లు కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఆయన మంతనాలు జరిపినట్లు తెలిసింది. అందరూ భావించినట్లుగానే చివరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిహార్‌లో గత మూడు దశాబ్దాల కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్.. కన్నయ్య కుమార్ రాకతో పార్టీని బలోపేతం చేయవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవాలని ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక గుజరాత్‌లోని వాద్గామ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దళిత నేత జిగ్నేష్ మేవానీకి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. తమ అభ్యర్థిని అక్కడ బరిలో నిలపలేదు. కీలక రాష్ట్రాల్లో ముఖ్యనేతలు పార్టీని వీడుతున్న తరుణంలో యువ నేతలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించి వారి సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.