కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి

శ్రీనివాసానందస్వామి హితవు
శ్రీకాకుళం, జూలై 21: అరిణాంఅక్కివలసలోని నాగార్జున అగ్రికెమ్‌ పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నాలను చేస్తోందని, వీటిని వెంటనే మానుకోవాలని పరిశ్రమ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధి శ్రీనివాసానందస్వామి హితవు పలికారు. ఎచ్చెర్ల మండలంలోని షేర్‌మహ్మద్‌పురం, ఎచ్చెర్లలలో అఖిలపక్ష నాయకులు, పరిశ్రమ వ్యతిరేక పోరాక కమిటీ సభ్యులు పోరాటానికి మద్ధతుగా గ్రామస్థాయిలో యువకులు, నాయకులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమ యాజమాన్యం ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న నాయకులను, కార్మికులను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు పాల్పడుతుందని, వీటిని తక్షణమే మానుకోవాలని ఆయన హెచ్చరించారు. భరించలేని వాయు, జల కాలుష్యంతో ప్రజలందరూ పరిశ్రమను మూసివేయాలని కోరుకుంటుంటే, యాజమాన్యం మాత్రం తిరిగి తెరిపించేందుకు ఎందుకు ప్రయత్రాలు చేస్తోందని ప్రశ్నించారు. పరిశ్రమను మళ్లీ తెరిపించినట్లయితే వంద గ్రామాలు సర్వనాశనమై, నివాసానికి పనికిరాని విధంగా తయారవుతాయని, ప్రజలు చైతన్యవంతులై పెద్ద ఎత్తున ఉద్యమించాలని, అవసరమైతే ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 24వ తేదీ తరువాత పరిశ్రమ శాశ్వతంగా మూసివేతకు జిల్లా యంత్రాంగం నుంచి ప్రకటన రాకపోతే ప్రజలందరూ ప్రజలందరూ అఖిలపక్ష నాయకులు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి సంఘటితంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి మాట్లాడుతూ ఇప్పటికే ఎచ్చెర్ల, లావేరు, పొందూరు మండలాల పరిధిలోని చాలా గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుని జీవించలేని విధంగా తయారయ్యాయన్నారు. పరిశ్రమ మూసివేతకు టిడిపి తరపున సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆయన అన్నారు. అఖిలపక్షం సమన్వయకర్త కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ పరిశ్రమలకు సంబంధించిన రూ. వేల కోట్ల ఆస్తులు నియోజకవర్గంలోనే ఉన్నాయని, పరిశ్రమలో పనిచేస్తున్నవారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కార్మికులందరికీ న్యాయం జరిగేలా తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలో కార్మికులతో అఖిలపక్ష నాయకులు, ప్రజాసంఘాలు సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధనలక్ష్మి, మురళీదర్‌బాబా, శంకరరావు, రాజారావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.