కిన్నెరసాని కుడికాల్వను ప్రారంభించిన సీఎం

ఖమ్మం, ఆగస్టు 9 : ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండోవ రోజు పర్యటన
బిజీబిజీగా కొనసాగింది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేశారు. ముందుగా వీఆర్‌ పురం మండలంలోని సున్నంవారి గూడెంలో గిరిజన హాస్టల్‌లో బస చేసిన ఆయన ఉదయం విద్యార్థులతో మాటా మంతి జరిపారు. భోజనం ఎలా ఉంది? మీరు పెద్దాయ్యాక ఏమవుతారని విద్యార్థులను ప్రశ్నించారు. వారు చిరునవ్వుతో సమాధానం చెప్పారు. అనంతరం ఆయన ఆ మండల ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఎక్కువగా పోలవరం ముంపు ప్రాంత బాధితుల నుంచే ఫిర్యాదులు అందాయి. ఇవేకాక ఏజెన్సీలోని 1/70 చట్టం సరిగ్గా అమలు కావడంలేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గిరిజనులు ఫిర్యాదు చేశారు. తరువాత ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆయన జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు. తరువాత కిన్నెరసాని ప్రాజెక్టు వద్దకు వచ్చి36 కోట్ల రూపాయల వ్యయంతో తవ్విన కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేశారు. పాల్వంచ, బూర్గంపాడు మండలాలకు చెందిన దాదాపు పది వేల ఎకరాలకు నీరు అందాల్సి ఉంది. ప్రస్తుతం చిన్న చిన్న అవాంతరాల వల్ల కుడి కాలువ ద్వారా 4 వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా వెయ్యి ఎకరాలకు మాత్రమే నీరుందుతోంది. మిగతా సమస్యలు కూడా పూర్తి స్థాయిలో అధిగమించి పది వేల ఎకరాలకు నీరిందించే ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన పాల్వంచలో నిర్మించిన మున్సిపాలిటీ భవనాన్ని ప్రారంభించారు. నవభారత్‌లోని ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని జిల్లాకు సంబంధించిన మరికొన్ని ప్రాజెక్టులు,విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, అవికూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలిపేందుకు అన్ని రకాల కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట జిల్లా మంత్రి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ ఉపసభాపతి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సత్యవతి, మిత్రసేన తదితరులు పాల్గొన్నారు.