‘కిరణ్‌ టీంలో మరో వికెట్‌

నేడు ధర్మాన రాజీనామా !
సీబీఐ చార్జిషీట్‌లో ఎ5 నిందితుడిగా చేర్చడంతో మనస్తాపం

మిగిలిన ‘నలుగురూ’ రాజీనామా చేయాలని తెర పైకి డిమాండ్లు
హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) :
‘కిరణ్‌ టీంలో మరో వికెట్‌ పడనుందా ? ఇదే జరుగొచ్చు ! సోమవారం మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు రాజీనామా నేడు రాజీనామ చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలే దీనికి బలాన్ని చేకూ రుస్తున్నాయి. జగన్‌ అక్రమాస్తులు కూడబెట్టుకు నేందుకు వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఆయనకు సహక రించారని ఆరోపణలున్నాయి. సీబీఐ ఈ ఆరోపణలకు బలం చేకూరేలా సోమవారం సీబీఐ నాంపెల్లి కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో ధర్మాన ప్రసాదరావును ఎ5 నిందితుడిగా చేర్చింది. ఈ విషయంతెలుసుకున్న ధర్మాన మనస్తాపానికి గురై తన సన్నిహితులతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారని తెలిసింది. ఎవరో పార్టీ పెద్దలు చెప్పేదాకా పదవిని పట్టుకుని వేలాడడం సరికాదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, సీబీఐ తన చార్జిషీటులో వైఎస్సార్‌ హయాంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాద్‌రావు జగన్‌కు మేలు చేసేలా, వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు అనుకూలంగా 9 9 జీవోలు చేశారని అభియోగాలు మోపింది. ధర్మాన దురుద్దేశ పూర్వకంగానే 2007, 2008, 2009 సంవత్సరాల్లో ఎ4 నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు మేలు చేస్తూ జీవోలు జారీ చేశారని ఆరోపించింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్టు చేసింది. వీరిలో నలుగురుచంచల్‌గూడ జైలులో ఉండగా, విజయసాయిరెడ్డి బెయిల్‌పై బయటున్నారు. అరెస్లయిన నలుగురిలో మే 15న నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డిని అరెస్టు చేయగా, మే 22న అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణ, మే 27న జగన్‌ను అదుపులోకి తీసుకుంది. వీరు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఈ కేసులో ధర్మానను ఎ5 నిందితుడిగా పేర్కొన్న సీబీఐ ఎ1గా జగన్‌, ఎ2గా విజయసాయిరెడ్డి, ఎ3 మోపిదేవి వెంకటరమణ, ఎ4 నిమ్మగడ్డ ప్రసాద్‌, ఎ6గా ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌, ఎ7గా కేవీ బ్రహ్మానందరెడ్డి, ఎ8గా డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌, ఎ9గా ప్రకాశ్‌, ఎ10గా వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌, ఎ11 జగతి పబ్లికేషన్స్‌, ఎ12, ఎ13గా జగన్‌కు చెందిన రఘురాం సిమెంట్‌, భారతీ సిమెంట్‌, కార్మెల్‌ ఏషియా, ఎ14గా సిలికాన్‌ బిల్డర్స్‌ను పేర్కొంది. ఈ 14 మంది నిందితులపై 120, 409, 419, 420, 477, 460, 471 వంటి సెక్షన్ల కింద సీబీఐ కేసులు నమోదు చేసింది. అయితే, తనను ఎ5 నిందితునిగా పేర్కొనడాన్ని ధర్మాన ప్రసాద్‌రావు తీవ్రంగా ఖండించారు. అంతే కాకుండా, ఆయన తీవ్ర మనస్తాపానికి కూడా గురైనట్లు తెలిసింది. దీంతో ధర్మాన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు, ఈ విషయాన్ని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి కూడా తెలిపినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, నేడు ధర్మాన నిర్ణయం అమలుకు నోచుకుంటుందా లేదా అన్నది స్పష్టమవుతుంది.