యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య యుద్ధానికి సై : ట్రంప్
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాపై భారీగా సుంకాలు విధించిన ట్రంప్.. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు హెచ్చరికలు జారీ చేశారు. ఈయూ తమతో దారుణంగా వ్యవహరించిందని, దానిపై సుంకాలు విధించక తప్పదని పేర్కొన్నారు.
ట్రంప్ హెచ్చరికలపై ఈయూ కూడా తీవ్రంగానే స్పందించింది. ట్రంప్ అన్నంత పనీ చేస్తే తాము కూడా గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటామని చెబుతూనే చర్చల ద్వారా వాణిజ్య సంఘర్షణను పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసింది.
27 దేశాల యూరోపియన్ యూనియన్‌పై సుంకాల విధింపు గురించి ఆలోచిస్తున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ‘‘ఈయూపై సుంకాలు విధిస్తాం. మీకు నిజమైన సమాధానం కావాలా? లేక రాజకీయ పరమైన సమాధానం కోరుకుంటున్నారా?’’ అని అయన ప్రశ్నించారు. యూరోపియన్ యూనియన్ తమను దారుణంగా ట్రీట్ చేసిందని ఆయన విమర్శించారు. ట్రంప్ తన మొదటి విడత పదవీకాలంలోనూ యూరోపియన్ యూనియన్ స్టీల్, అల్యూమినియం ఎగుమతులపై భారీగా సుంకాలు విధించారు. ఇది ఈయూతో వాణిజ్య యుద్ధానికి దారితీసింది. ప్రతిగా యూరోపియన్ యూనియన్ అమెరికా నుంచి ఎగుమతి అయ్యే విస్కీ, మోటార్ సైకిళ్లు సహా పలు వస్తువులపై సంకాలు విధించి ప్రతీకారం తీర్చుకుంది.