కూలీలకు కనీసం వేతనం అందేలా చర్యలు చేపట్టాలి

కడప, జూలై 30 : కూలీలకు కనీస వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్‌ వద్ద రైల్వే కోడూరు పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ధర్నాలు జరిగాయి. కడప కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో నగర కార్యదర్శి మనోహర్‌ మాట్లాడుతూ కడప నగరంలో నిరుపేదలకు కనీస వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలు శ్రమదోపిడికి గురవుతున్నారన్నారు. అతి త్వరలో వివిధ రంగాలలో దినకూలీలుగా పనిచేస్తున్న వారందరిని గుర్తించాలని అన్నారు. వారందరికి రేషన్‌కార్డులు ఇళ్ళస్థలాలు, ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా ఇయస్‌ఐ సౌకర్యం కూడా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే కోడూరులో జరిగిన ధర్నాకు సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్‌ నాయకత్వం వహించారు.