‘కొండా’ సీటును తెలంగాణ ప్రజలు గుంజుకున్నరు

ఉద్యమాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నరు ,
బీజేపీ నైజం బయటపడ్డది ,
ఈ గెలుపు జయశంకర్‌సార్‌కు అంకితం : ఈటెల
ఉప ఎన్నికల్లో కొండా సురేఖ పరకాల సిట్టింగ్‌ స్థానాన్ని తెలంగాణ ప్రజలు గుంజుకున్నరని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. వరంగల్‌లో బుధవారం జరిగిన టీఆర్‌ఎస్‌ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణవాదానికే ప్రజలు పట్టం గడుతారనడానికి పరకాల ఫలితమే నిదర్శనమని పేర్కొన్నారు. సమైక్యవాద వైఎస్సార్‌ కాంగ్రెస్‌, టీడీపీ,కాంగ్రెస్‌ వంటి తదితర పార్టీలు పరకాల ఓటర్లను ప్రలోపెట్టేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేసినా ప్రజలు తలొగ్గకుండా తెలంగాణవాదాన్నే గెలిపించారన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీ జెండా కింద, ఆ పార్టీ నీడన ఎంత గొంతుచించుకున్నా ప్రజలు వారిని నమ్మబోరని ఈటెల తెలిపారు. ఈ ఉప ఎన్నికోల్ల భారతీ జనతాపార్టీ నైజం బట్టబయలైందన్నారు. సీమాంధ్రలో ప్రచారంనిర్వహించకుండా పరకాలలో మాత్రమే పార్టీ అగ్రనేతలంతా మకాం వేసి ప్రచారం నిర్వహించినా ఫలితం దక్కకుండాపోయిందన్నారు. బీజేపీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో మిలాఖత్‌ కావడం వల్లనే అక్కడ ప్రచారం నిర్వహించలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపర్చేందుకు ఎన్ని శక్తులు కుట్రలు పన్నినా తెలంగాణ ప్రజలు వాటిని తిప్పికొడతారని, తెలంగాణ ఉద్యమాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారని ఆయన చెప్పారు.