కోటి రుపాయల ఆస్తిని రిక్షా కార్మికుడికి దానం చేసిన వృద్ధురాలు
భువనేశ్వర్: ఏ ప్రతిఫలం ఆశించకుండా రిక్షా కార్మికుడు చేసిన సేవకు ఓ వృద్ద మహిళ కోటి రుపాయలకుపైగా ఆస్తిని దానం చేసింది. ఈ మేరకు ఆస్తిని అతని పేరు మీద రాసిన పత్రాలను రిక్షా కార్మికుడికి అందించింది. ఈ ఘటన ఒరిస్సాలోని సంబల్పూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సబల్పూర్కు చెందిన మినాతి పట్నాయక్(63) భర్త 2020లో మరణించగా, తన కుమార్తె 2021లో మరణించింది. అప్పటి నుంచి తనని ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఆమె బంధువులు ఇటీవల తన ఆస్తి కోసం ఒక్కసారిగా ఆమెతో దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గత 25 ఏళ్లుగా ఆమె కుటుంబానికి నమ్మకంగా పని చేస్తున్న వచ్చిన రిక్షా కార్మికుడికి తన ఆస్తి మొత్తాన్ని దానం చేసింది. అందులో రూ.కోటి విలువైన భవనం, ఇతర సామగ్రిని అతని పేరుపై రిజిస్ట్రేషన్ చేయించింది. దీనిపై వృద్దురాలు మాట్లాడుతూ.. తన భర్త, కూతురు చనిపోయి కృంగిపోయి, దుఃఖంలో బతుకుతున్నప్పుడు, తన బంధువులెవరూ కూడా అండగా నిలబడలేదని ఆ సమయంలో తాను ఒంటరిగా కాలాన్ని గడిపినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆ రిక్షా కార్మికుడు, అతని కుటుంబం మాత్రం ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు పేర్కొంది. అందుకే ఆస్తి కోసం ఎదురుచూసే వారికంటే ఏ లాభం ఆశించకుండా తన కుటుంబం కోసం నిశ్వార్ధంగా పని చేసిన బుధాకు( రిక్షా కార్మికుడు) తన ఆస్తిని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది.