కోలుకుంటున్న శతృఘ్నసిన్హా
ముంబాయి: ఇటీవలే బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్న నాటితరం బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హాను గురువారం నాడు ఐసీయూ నుంచి గదికి తరలించారు. గురువారం ఉదయం ఆయనను గదికి తరలించారనీ, వైద్యుల సూచనల మేరకు మరికొద్ది రోజుల పాటు ఆయన ఆసుపత్రిలోనే ఉంటారని ఆయన సమీప బంధువైన పహ్లాజ్ నిహలానీ తెలిపారు. ఇక్కడి కోకిలా బెన్ ఆసుపత్రిలో ఆయనకు బైపాస్ జరిగింది. శతృఘ్న సిన్హా ఆరోగ్యం బాగుందని.. మెల్లగా కోలుకుంటున్నారి చెప్పారు. శతృఘ్న సిన్హా భార్య పూనం, కుమార్తె సోనాక్షి, కవల కుమారులు లవ్‌కశ్‌లు ఆయనకు దగ్గరెండి చూసుకుంటున్నారు. వైద్యులైన శతృఘ్న అన్నయ్యలు లఖన్, భరత్‌సిన్హాలు తమ్ముడి ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సూపర్‌స్టార్ రాజేష్‌ఖన్నా మృతి చెందిన వార్త తెలియగానే శతృఘ్న సిన్హా చాలా బాధపడ్డారనీ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.