గ్రామాలను సందర్శించిన ప్రపంచ బ్యాంకు బృందం

సంగారెడ్డి, నవంబర్‌ 1 : చేగుంట మండల కర్నాల్‌పల్లి, మక్కరాజుపేట గ్రామాలలో స్వయం సహాయక సంఘాలు అమలు చేస్తున్న అభివృద్ధి పనులను ప్రపంచబ్యాంకు బృందం సభ్యులు పరిశీలించారు. 30 దేశాలకు చెందిన 40 మంది ప్రతినిధుల బృందం కర్నాల్‌పల్లి, మక్కరాజుపేట గ్రామాలలో మహిళలు సాధించిన ఆర్థిక ప్రగతి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పొదుపు ఎలా చేస్తారు, పొదుపు చేసిన డబ్బుకు ఎలా రుణం పొందుతారు, ఆ డబ్బుతో చిరువ్యాపారాలను చేసి ఆర్థికంగా ఎలా ఎదుగుతున్నారో తెలుసుకున్నారు. పొదుపు వల్ల వారి పెట్టుబడి ఎలా పెరిగిందో తెలుసుకున్నారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకు ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందని ప్రతినిధి బందంకు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ అధ్యయన కేంద్రం ప్రొఫెసర్‌ రామారావు, జయదేవ్‌, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.