ఘనంగా కనకదుర్గమ్మ పవిత్రోత్సవాలు

విజయవాడ, ఆగస్టు 1 : కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అభిషేకానంతరం ఆలయంలోకి భక్తులకు అనుమతించారు. ప్రతి శ్రావణమాసంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహించడం అనవాయితీ. కాగా, అందుకు తగిన విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని శుద్ధి చేసి అమ్మవారిని చక్కగా పూలమాలలతో అలంకరించి భక్తులకు సందర్శనం కల్పించారు. గురువారం వరకు జరిగే ఈ పవిత్రోత్సవాల్లో అనేక విశేష పూజలు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి రఘునాథ్‌ తెలిపారు. పవిత్రోత్సవాల తొలి రోజున భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.