ఘనంగా కల్యాణ వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ

రాజమండ్రి, ఆగస్టు 2 : శ్రీవేంకటేశ్వర ఆనంకళాకేంద్రం ప్రాంగణములో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నూతనంగా నిర్మించిన శ్రీబాలజీమందిర్‌లో శ్రీభూసమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా మూడవ రోజున గురువారం వేదమంత్రోచ్చరణల మధ్య యంత్ర స్థాపన జరిపి ఆపై విగ్రహ ప్రతిష్టలు నిర్వహించారు. అనంతరం కర్మ సమృద్ధిహోమం, కర్మపరిపూర్ణ హోమం, పూర్ణాహుతి, త్రిషోడశ కళావాహనం, ప్రధమార్చన, గోదర్శనం, కుంచనివేదన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా దేవ ప్రబోధనం, త్రిషవణస్నపనం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రత్నన్యాసం మొదలగు కార్యక్రమాలను నిర్వహించారు. రాజమండ్రి ఎంపి ఉండవల్లి అరుణకుమార్‌, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి పట్టణ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్‌రావు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అర్బన్‌ జిల్లా ఎస్పీ రవికుమార్‌ మూర్తి దంపతులు, శంకర్రావు, హనుమంతరావు, గోపాలకృష్ణ, రాష్ట్ర అర్చక సంఘం కార్యదర్శి ఆచార్య ప్రముఖ కాంట్రాక్టర్‌ సుబ్బారావు దంపతులు, తదితరుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నింటిని సుదర్శనం జనార్ధనాచార్యులు వారి శిష్యబృందం నిర్వహించారు.