వెనెజువెలా చమురు కొనుగోలుకు భారత్ ముందుకొచ్చింది

` దీనికి సంబంధించిన ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాం
` చైనా కూడా మాతో చర్చలు జరిపే అవకాశం : ట్రంప్
వాషింగ్టన్(జనంసాక్షి): భారత చమురు దిగుమతుల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలా నుంచి చమురు దిగుమతులకు భారత్ ముందుకొచ్చిందని పేర్కొన్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “మేము ఇప్పటికే వెనెజువెలాతో ఒక డీల్ కుదుర్చుకున్నాం. ఇందులో భారత్ కూడా చేరనుంది. భారత్ ఇకపై వెనెజువెలా చమురును దిగుమతి చేసుకుంటుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాం” అని ట్రంప్ తెలిపారు. అయితే, దీనిపై భారత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.ఇక, వెనెజువెలా చమురు కోసం చైనా కూడా తమతో చర్చలు జరిపే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. దాన్ని మేము స్వాగతిస్తామన్నారు. మరోవైపు వెనెజువెలాలో పాలనపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఇప్పుడు తన అధీనంలోనే ఉందన్నారు. తాను కోరుకున్నట్లుగానే ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. అక్కడి చమురు నిల్వలు పూర్తిగా అమెరికా చేతికి వచ్చే వరకు ఆమెనే తాత్కాలిక నాయకురాలిగా కొనసాగుతారని తెలిపారు. వెనెజువెలాపై సైనిక దాడి చేసి.. ఆ దేశ నేత నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. భారత ప్రధాని మోదీ ` రోడ్రిగ్జ్‌లు ఇటీవల ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులతో సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు.