చంద్రబాబును అడుగడుగునా అడ్డుకోండి..

-బాబూ..నువు మాకోసం రావొద్దు..
-తెలంగాణపై తేల్చాకే అడుగుపెట్టు
-22న చలో రాజోలీ
-టీజేసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణపై తేల్చాకుండా చంద్రబాబు మహబూబూనగర్‌లో అడుగుపెడితే అడుగడుగునా అడ్డుకోవాలని జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం 800 మంది విద్యార్థులు ఆత్మత్యాగం చేసుకున్నపుడు స్పందించని బాబు ఇపుడు మాకోసం రావాల్సిన అవసరం లేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణలో అడుగుపెడితే చంద్రగ్రహణమే అని…ఆయన వచ్చినప్పుడు తలుపులు మూసుకుని నల్లజెండాలు ఎగరవేసి నిరసన తెలపాలని కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాకే ఈ ప్రాంతంలో పర్యటించాలని లేకుంటే ఆయనకు అడ్డంకులు తప్పవని హెచ్చరించారు. చంద్రబాబు వైఖరి వల్లే తెలంగాణ వచ్చిన తెలంగాణ వెనక్కి పోయిందని మండిపడ్డరు. ఆయన ఇచ్చిన లేఖ వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా మరింత గందరగోళం ఏర్పడిందని ఆయన విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అమరచింతాలో శనివారం జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ నెల 22న జిల్లాలో ప్రారంభం కానున్న చంద్రబాబు పాదయాత్రను అడ్డుకునేందుకు చలో రాజోలీ పిలుపునిచ్చారు. చంద్రబాబు కేవలం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రధానికి లేఖ రాశారు తప్ప అందులో కొత్తదనమేమీ లేదన్నారు. వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసారే తప్ప తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా? అనే అంశంపై ఆయన ఎటువంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఏదో ఒకటి తేల్చి చెప్పిన తర్వాతే ఆయన తెలంగాణలో అడుగు పెట్టాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. పాదయాత్రకు నిరసనలు, నిలదీతలు తప్పవని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎటువైపు ఉంటుందో టిడిపి తేల్చుకోవాలని అన్నారు. చంద్రబాబు తెలంగాణలో కాలు మోపడం అంటే బలిచక్రవర్తిపై వామనుడుపాదం మోపడమేనని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే నిరసనలు తప్పవని అన్నారు. 2009 ఎన్నికల హామీకి కట్టుబడి ఉందో,లేదో టిడిపి చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి పెద్దఎత్తున తరలిరావాలని ఆయన తెలంగాణ వాదులకు పిలుపునిచ్చారు.