చంద్రబాబు తెలంగాణకు మోసం చేయలేదట ! సుప్రీంలో పిటీషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ, జూలై 3 : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. తెలంగాణ ప్రజలను మోసం చేశారంటూ చంద్రబాబుపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు.. రాజకీయ కారణాలతో కూడిన ఇలాంటి కేసుల విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఇద్దరు లాయర్లు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ విషయంలో మాట మార్చారని వారు కోర్టు కెక్కారు. కాగా 2009 డిసెంబర్‌ 9న కేంద్రం తెలంగాణను ప్రకటించే కంటే ముందు చంద్రబాబు కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అఖిల పక్ష సమావేశంలో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అంతకుముందు టీడీపీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఆతరువాత జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ఉద్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంది. అయితే డిసెంబర్‌ 9న కేంద్రం తెలంగాణ ప్రకటించాక మాత్రం చంద్రబాబు యూ టర్న్‌ తీసుకున్నారనేది తెలంగాణవాదుల వాదన.
కేంద్రం తెలంగాణ ప్రకటించిన మరుసటి రోజే చంద్రబాబు అర్ధరాత్రి ప్రకటనలపై మండిపడ్డారు. ఆ తరువాత సీమాంధ్ర నేతలు వరుసగా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. దీంతో కేంద్రం డిసెంబర్‌ 23న తెలంగాణ ప్రకటనపై వెనక్కి తగ్గింది. అయితే ప్రకటన తరువాత చంద్రబాబు యూ టర్న్‌ తీసుకోవడం కూడా కేంద్రం వెనక్కి వెళ్లడానికి కారణమని చెబుతున్నారు. మరో వైపు టీ టీడీపీ నేతలు మాత్రం తెలంగాణకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెబుతున్నారు.