చంద్రుడి అన్వేషణలో చైనా విజయం
– భూమికి చేరిన చాంగే-5 క్యాప్సుల్
బీజింగ్,డిసెంబరు 17 (జనంసాక్షి): నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా చంద్రుడి నమూనాలు భూమికి చేరాయి. దీంతో తమ దేశం చేపట్టిన చాంగే-5 ప్రయోగం విజయవంతమైనట్లు చైనా ప్రకటించింది. చంద్రుని నుంచి మట్టి నమూనాలతో రెండు రోజుల క్రితం బయలుదేరిన క్యాప్సూల్, గురువారం తెల్లవారుజామున భూమికి చేరింది. ఉత్తర చైనాలోని మంగోలియా ప్రాంతంలో స్థానిక కాలమాన ప్రకారం తెల్లవారుజామున 1.59గం.లకు భూమిని చేరినట్లు ఆ దేశ జాతీయ అంతరిక్ష ప్రయోగకేంద్రం(సీఎన్ఎస్ఏ) ప్రకటించింది. చంద్రుడి నమూనాలతో భూమిపైకి చేరిన చాంగే-5 క్యాప్సూల్‌ను తెరిచేందుకు దానిని బీజింగ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం శాస్త్రవేత్తలు వాటిపై ప్రయోగాలు జరుపనున్నారు. అయితే, వాటిలోని కొన్ని నమూనాలను ఇతర దేశాల శాస్త్రవేత్తలకు కూడా అందించే అవకాశం ఉన్నట్లు చైనా అంతరిక్ష ప్రయోగ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ పై ఝవోయూ వెల్లడించారు.
40ఏళ్ళలో తొలిసారి..
చంద్రుడిపై అన్వేషణలో భాగంగా నవంబర్ 24న చైనా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. 40ఏళ్ల క్రితం అమెరికా ఇద్దరు వ్యోమగాములను చంద్రునిపైకి పంపి నమూనాలను సేకరించిన విషయం తెలిసిందే. అనంతరం సోవియట్ యూనియన్ కూడా 1976లో చంద్రుడుపై పరిశోధనలో అక్కడి మట్టి నమూనాలను భూమికి తీసుకురాగలిగింది. ఈ రెండు దేశాల తర్వాత చంద్రుడి నుంచి మట్టి నమూనాలను సేకరించిన మూడో దేశంగా చైనా నిలిచింది. ప్రస్తుత ప్రయోగం ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి దాదాపు 2కిలోల మట్టి, రాళ్ల తీసుకువచ్చినట్లు సమాచారం.చైనా అంతరిక్ష ప్రయోగాల చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన ప్రయోగంగా చాంగే-5ని భావిస్తున్నారు. అమెరికా, సోవియట్ యూనియన్లు చంద్రుడిపై దిగిన ప్రదేశం కంటే ప్రస్తుతం చైనా వ్యోహనౌక దిగిన ప్రదేశం భిన్నమైనదని ఆ దేశ శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు. తాజా ప్రయోగం విజయవంతం కావడం.. రానున్న రోజుల్లో మానవసహిత ప్రయోగాలకు ఊతమిస్తోందని చైనా అంతరిక్ష ప్రయోగ కేంద్రం అభిప్రాయపడింది. అంతేకాకుండా చంద్రుడిపై అన్వేషణలో ఇతర దేశాలతోనూ కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అక్కడి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా చైనా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.