చంపై సోరెన్ బీజేపీ తీర్ధం
రాంచీ(జనంసాక్షి):జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత చంపై సోరెన్ బీజేపీలో చేరారు. శుక్రవారం రాంచీలో పార్టీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. చంపై సోరెన్‌కు జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హాజరయ్యారు.ఈ సంధర్భంగా చంపై సోరెన్ మాట్లాడుతూ.. ’ఈ రోజు నేను కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాను. మొదట రాజకీయాల నుంచి పదవీ విరమణ పొందాలని అనుకున్నాను. తరువాత కార్మికులు, ప్రజల ఉత్సాహాన్ని చూసి రాజకీయాల్లో కొనసాగాలనుకున్నా.. మొదట ప్రజలకు సేవ చేయడానికి కొత్త సంస్థ ఏర్పాటు చేయాలనుకున్నా.. కానీ సమయ పరిమితులు, జార్ఖండ్‌లోని ప్రత్యేక డైనమిక్స్ కారణంగా, బీజేపీలో చేరాల్సి వచ్చింది..’ అని చంపై సోరెన్ కాషాయ పార్టీలో చేరాలనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ చెప్పారు.కాగా, ఇటీవల చంపై సోరెన్ సొంతపార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ జేఎంఎంకు రాజీనామా చేశారు. ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు లేఖ విడుదల చేశారు.