చర్చలు విఫలం సంబురం లేదు.. ‘సాగర’ సమరమే

ఢిల్లీలో తెలంగాణ అంశంపై కేసీఆర్‌ జరుపుతున్న చర్చల సంగతేమైంది ? ఏమైతది ! మళ్లీ
మొదటికొచ్చింది ! ”సమరం చేద్దాం. సాధిద్దాం. సమర ఫలితాన్ని సంబురాలుగా జరుపుకుందాం.” ”చర్చిద్దాం. చర్చలు సాగదీద్దాం. మళ్లీ చర్చిద్దాం. అవమానించబడుదాం. ఆ అవమానాలతో భిక్షగా ఇస్తే తీసుకుందాం. ఆ తర్వాత అదే మన సాధించిన విజయమందాం. అప్పుడు సంబురాలు జరుపుకుందాం.” పైన చదివిన రెండు వ్యాఖ్యలను చదివాక, ఏమనిపిస్తున్నది ? మొదటిది కరెక్టా.. రెండోదా ? ఓ నిజమైన తెలంగాణవాది కోరుకునేది మొదటి సందర్భాన్నే. అదే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది. కానీ, ‘ఉద్యమ పార్టీ’ అధినేత కేసీఆర్‌ మాత్రం రెండోది కోరుకుంటున్నరు. అందుకే, యావత్‌ తెలంగాణ సీమాంధ్ర పాలకులతో ‘విజయమో వీర స్వర్గమో’ అన్న రీతిలో సంగ్రామానికి సన్నాహాలు చేసుకుంటుంటే, ఆయన మాత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వెళ్లడానికి ముందు, తనకు రాష్ట్ర ఏర్పాటుపై సంకేతాలు వచ్చాయని, సెప్టెంబర్‌ రెండో వారంలో తెలంగాణ వస్తుందని, ఇక రాష్ట్రం కోసం ఉద్యమించాల్సిన పని లేదని, తెలంగాణ ప్రజల మొహాన ఓ ఉచిత ప్రకటన చేసి పోయారు. వెళ్లినప్పటి నుంచి ఢిల్లీలో ఉండే కాకలు దీరిన పెద్దలతో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. ఇంకా జరుపుతారట ! ఇప్పటికి కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినప్పటి నుంచి ఓ పదిసార్లు చర్చలు జరిపారు. కేసీఆర్‌ ఎవరితోనైతే ఎక్కువగా ఈ చర్చిస్తున్నారో, ఆయన మధ్యలో ఓసారి చైనా కూడా వెళ్లి వచ్చారు. ఆయనెవరో కాదు. వయలార్‌ రవినే. వయలార్‌ రవి వచ్చాక తెలంగాణపై స్పష్టత వస్తుందని అన్నారు. ఈ మాటలు కూడా అన్నది కేసీఆర్‌ కాదు, స్థానిక తెలంగాణ నాయకులే ! ఓకే.. వయలార్‌ వచ్చారు. కేసీఆర్‌ మళ్లీ చర్చించారు. ఇంకోసారి చర్చించారు. ఇలా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. వయలారేమో కేసీఆర్‌తో నేను చర్చిస్తూనే ఉంటాను అంటున్నారు. కానీ, ఈ చర్చల గురించి కేసీఆర్‌ మాత్రం ఒక్క ముక్క మాట్లాడడం లేదు. ‘నో కామెంట్‌’ అంటూ విలేకరులను పక్కకు తోసుకుని కారెక్కి తుర్రుమంటున్నారు. కేసీఆర్‌ తెలంగాణ కోసం చర్చలు జరుపుతున్నారని, టీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. కానీ, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికే కేసీఆర్‌ ఢిల్లీలో మకాం వేశారని, ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటువంటి విమర్శలపై నిజానికైతే కేసీఆరే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి సమాధానం చెప్పాలి. కానీ, టీఆర్‌ఎస్‌కు చెందిన స్థానిక నాయకులు కూడా ఈ విమర్శలపై స్పందించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటి ! నిన్న అంటే మంగళవారం కూడా కేసీఆర్‌ వయలార్‌ రవితో చర్చించారు. చర్చలు ఆయ్యాక కేసీఆర్‌ చర్చ విశేషాలు చెబుతారని అందరూ ఎదురుచూశారు. ఈసారి కూడా ఆయన నిరాశపర్చారు. ఎటువంటి ప్రకటన వెల్లడించకుండానే వెళ్లిపోయారు. కేసీఆర్‌ వయలార్‌తో చర్చించడానికి ముందు సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. యావత్‌ తెలంగాణ సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన వస్తుందని ఆశించారు. కానీ, ఆ విషయం చర్చకు రాకుండానే సమావేశం ముగిసింది. మరి కేసీఆర్‌ దాదాపు 15 రోజులుగా ఉండి, చర్చలు జరిపి, సాధించిందేమిటి ? కనీసం కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశంలో తెలంగాణ అంశాన్ని చర్చకు కూడా తేలేకపోయారు. మరిలాంటప్పుడు, తెలంగాణ కోసం చర్చలు జరపడమెందుకు ? చర్చలతో తెలంగాణ రాదని గతంలోనే తేలిపోయింది. మళ్లీ చర్చల గానం ఆలపించడం కేసీఆర్‌ ఉద్దేశమేమిటో ఆయనకే తెలియాలి. స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా కేసీఆర్‌ ఢిల్లీలో ఏం చేస్తున్నరో చెప్పలేక తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. చర్చలు వద్దు.. ఉద్యమిద్దాం అన్న తెలంగాణ జేఏసీ మాటలను పక్కనబెట్టి, త్వరలో తెలంగాణ అని ప్రకటించిన కేసీఆర్‌ ఎలాంటి కబురు మోసుకురానున్నారోననే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఒకానొక దశలో కేంద్రం తెలంగాణ ఇచ్చేందుకు సుముఖంగా లేదని, కేసీఆర్‌ ఎంత నచ్చజెప్పినా వయలార్‌తో సహా ఏ ఒక్క ఢిల్లీ పెద్ద కూడా వినడం లేదన్న వార్తలు వస్తున్నాయి. రానున్న 30న జరిగే తెలంగాణ మార్చ్‌తో ఢిల్లీ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నా, కేసీఆర్‌ చర్చలే వాళ్లకు కొంత ఊరటనిస్తున్నాయని, ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, కేసీఆర్‌ ఢిల్లీలోనే ఉండిపోతారా ? ఎక్కువ శాతం తెలంగాణవాదులు చర్చలు విఫలమయ్యాయనే అంటున్నారు. అంటే, కేసీఆర్‌ చెప్పినట్లు సంబురాలు జరుపుకునే రోజూ దగ్గర్లోనే ఉన్నా, మరీ దగ్గరగా లేదనేది సుస్పష్టం. ఇదే నిజమైతే కేసీఆర్‌ ఇంకా చర్చలంటూ ఢిల్లీలో కాలం వెల్లదీయడం సరికాదు. తెలంగాణకు వచ్చేయాలి. ప్రస్తుతం తెలంగాణ మొత్తం జాతరగా ట్యాంక్‌ బండ్‌పై నిర్వహించతలపెట్టిన ‘సాగర హారం’లో ప్రత్యక్షంగా పాల్గొనాలి. మళ్లీ ఉద్యమాన్ని ఉరికించాలి. అంతేగానీ, 30న కూడా చర్చలంటూ కేసీఆర్‌ ఢిల్లీలో ఉండిపోతే, ఆయన భవిష్యత్తు అంధకారమే ! అందుకే, పైన చెప్పుకున్న రెండు వ్యాఖ్యల్లో మొదటి దాని వైపే కేసీఆర్‌ కట్టుబడితే మంచిది ! తెలంగాణ ప్రజలు కూడా చర్చలతో రాదు తెలంగాణ.. సమరం సాగిద్దాం.. సమరంతో సాధించిన విజయాన్ని సంబురాలుగా జరుపుకుందామని కోరుకుంటున్నారు.