చార్మినార్‌కు సరికొత్త శోభ..


` ఏక్‌శ్యామ్‌ చార్మినార్‌కే నామ్‌ విజయవంతం
` మువ్వన్నెల విద్యుత్‌ కాంతులతో మెరిసిన చార్మినార్‌
` సందర్శకులను ఆకట్టుకున్న వివిధ రకాల స్టాళ్లు, ఫుడ్‌ కోర్టులు
` సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగిన కార్యక్రమం
` ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్‌ బ్యాండ్‌
` ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
హైదరాబాద్‌,అక్టోబరు 17(జనంసాక్షి): పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద ‘ఏక్‌ శామ్‌ చార్మినార్‌ కె నామ్‌’ కార్యక్రమం సందడిగా సాగింది.హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న ‘సండే ఫన్‌ డే’ కార్యక్రమం మాదిరిగా చార్మినార్‌ వద్ద కూడా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు ప్రతి ఆదివారం చార్మినార్‌ వద్ద ‘ఏక్‌ శామ్‌ చార్మినార్‌ కె నామ్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చార్మినార్‌ అందాలతో పాటు వివిధ రకాల స్టాళ్లు, ఫుడ్‌ కోర్టులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. మువ్వన్నెల విద్యుత్‌ కాంతులతో చార్మినార్‌ మెరిసిపోతోంది. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చార్మినార్‌ వైపు వచ్చే వాహనాల రాకపోకలు నిలిపివేసి ట్రాఫిక్‌ను ఇతర మార్గాలకు మళ్లించారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్కింగ్‌ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు. ఇవాళ్టి కార్యక్రమాల్లో పోలీస్‌ బ్యాండ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళల భద్రత కోసం షీ బృందాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. వివిధశాఖల అధికారుల సమన్వయంతో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.