జిల్లాలో కొత్తగా మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు

శ్రీకాకుళం, ఆగస్టు 3 : జిల్లాలో జలుమూరుతో పాటు కొత్తగా మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఏర్పాటు కానున్నాయని, దీనిపై ప్రభుత్వం జీవో విడుదల చేసిందని జిల్లా మార్కెట్‌ కమిటీ ఏడీ ఎస్‌టి నాయుడు తెలిపారు. జలుమూరు మండల కేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక కమిటీ ఉండాలన్న లక్ష్యంతో జిల్లాలో మార్కెట్‌ కమిటీలను సర్ధుబాటు చేయగా కొత్తగా ఎచ్చెర్ల, పలాస కేంద్రాలలో ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. అదనంగా జలుమూరులోనూ ఏర్పాటు చేస్తునట్లు చెప్పారు. జలుమూరు పరిధిలో జలుమూరు, సారవకోట మండలాలు ఉంటాయని వివరించారు. ఒక నియోజకవర్గంలో రెండు మార్కెట్‌ కమిటీలు పాతపట్నం, నరసన్నపేట నియోజకవర్గాల్లో ఉన్నాయన్నారు. జలుమూరుకు సంబంధించి పర్సన్‌ ఇన్‌ఛార్జి కార్యదర్శుల నియామకం పూర్తయినట్లు తెలిపారు. జీవో విడుదలయిన తరువాత ఎచ్చెర్ల, పలాసల్లో కమిటీల నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు.