-జిల్లా పరిషత్ నూతన జడ్పి చైర్పర్సన్ గా శాంతకుమారి ఏక గ్రీవ ఎన్నిక.

-తిమ్మాజీపేట జడ్పి టిసి ప్రతిపాదించగా, బలపరిచిన పెద్దకొత్తపల్లి జడ్పిటిసి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్22(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ నూతన జడ్పి చైర్పర్సన్ గా ఉరుకొండ మండలం జడ్పిటిసి శాంతకుమారి ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ప్రకటించారు.గురువారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని లెక్చర్ హాల్-2 లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నూతన  జిల్లా పరిషత్ చైర్మన్ ను ఎంపిక చేయడం జరిగింది.ఉదయం 11 గంటలకు బి.ఆర్.ఎస్.నుండి 16 మంది జడ్పిటిసిలు, కాంగ్రెస్ నుండి 3 జడ్పిటిసిలు వెరసి 19 మంది జడ్పిటిసిలు హాజరయ్యారు.జడ్పి చైర్మన్ ఎంపికకు అవసరమైన కోరం  హాజరు కావడంతో ప్రిసైడింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ పరోక్ష విధానం ద్వార జడ్పి చైర్పర్సన్ ఎంపిక ఉంటుందని ఏ పార్టీ నుండి కూడా ఫారం-ఏ లేదా ఫారం-బి మరియు ఇతరాత్ర ఫారాలు అందలేదని తెలుపుతూ సభ్యులు ఒకరు ప్రతిపాదిస్తే  మరొకరు బలపర్చాల్సి ఉంటుందని సభ్యులకు తెలిపారు.  ఇందుకు అనుగుణంగా తిమ్మాజీపేట జడ్పి టిసి సభ్యుడు దయాకర్ రెడ్డి లేచి ఉరుకొండ జడ్పిటిసి సభ్యురాలైన శాంతాకుమారి పేరు ను జడ్పి చైర్పర్సన్ గా ప్రతిపాదించగా పెద్దకొత్తపల్లి జడ్పిటిసి మేకల గౌరమ్మ బలపరిచారు. శాంతాకుమారి పేరు తప్ప మరే పెరు ప్రతిపాదనకు రాకపోవడంతో శాంత కుమారి ని జిల్లా పరిషత్ నూతన చైర్పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.ఈ ప్రత్యేక సమావేశానికి పార్లమెంట్ సభ్యులు పి.రాములు,ప్రభుత్వ విప్, అచ్ఛంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు,నాగర్ కర్నూల్ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి,కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి, కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్ యాదవ్ అదనపు కలెక్టర్ మను చౌదరి తదితరులు పాల్గొన్నారు.