జీవ వైవిధ్యం భారతీయం : సీఎం కాప్‌ – 11 ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి):

భారతీయ జీవన విధానంలోనే జీవవైవిధ్యం ఇమిడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అతిథులంతా జీవ వైవిధ్యంపై చర్చతో పాటు రాష్ట్రంలోని జీవావరణ ప్రాంతాలు, హైదరాబాద్‌ను సందర్శించి స్థానిక సంస్కృతి తెలుసుకోవాలని ఆయన కోరారు.అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో భాగంగా కాప్‌-11 ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పశుప్రదర్శనను కూడా సీఎం ప్రారంభించారు.  హైటెక్స్‌ వేదికగా ప్రారంభమైన ఈ సదస్సును ¬చినో
కజుకి ప్రారంభించారు. అధికారికంగా కాప్‌-11 సదస్సు బాధ్యతను మన దేశం తరపున కేంద్ర మంత్రి జయంతీ నటరాజన్‌కు అప్పగించారు. చెక్క-సుత్తి సంప్రదాయబద్ధంగా అందించి బాధ్యతలు అప్పగించారు. ఇందులో ఐక్యరాజ్య సమితి ప్రత్యేక పర్యావరణ కార్యదర్శి అమినో మహ్మద్‌తో పాటు జీవ వైవిధ్య సదస్సు కార్యదర్శి బ్రోల్యో, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్రం తరపున అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామారావు, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్‌ గరిష్ఠంగా నిధులు కేటాయిస్తోందని, కొత్త పథకాలను రూపొందిస్తుందని జయంతి నటరాజన్‌ తెలిపారు. భవిష్యత్‌లో జీవావరణ పరిరక్షణ కోసం ఈ సదస్సు కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తుందని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో 193 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. హైటెక్స్‌ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.