టీడీపీ వల్లే బీసీలకు అభ్యున్నతి

గుంటూరు, జూలై 26 : తెలుగుదేశం పార్టీ బిసిల అభ్యున్నతికి మొదటి నుంచి పాటు పడుతోందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కె.ఎర్రంనాయుడు అన్నారు. ఆ విషయంపై రాజకీయంగా వక్రీకరించి మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. జిల్లాలో బిసి సదస్సులో ఆయన ప్రసంగించారు. సభకు వేల్పుల సింహాద్రి అధ్యక్షత వహించారు. ఎర్రం నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బీసీిలకు వందసీట్ల డిక్లరేషన్‌ ప్రకటించిన తర్వాతే కేంద్రమంత్రికి పెట్రోలు బంకుల్లో బిసిలకు రిజర్వేషన్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తెదెపా రాష్ట్ర అధికార ప్రతినధి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ బిసిలకు వందసీట్లు ప్రకటించిన నేపథ్యంలో బిసీలంతా సంఘటితంగా వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత వుందన్నారు. వైయస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓట్లకోసం బిసిలను వాడుకున్నారు తప్పవారికి చేసిన న్యాయం ఏమీ లేదన్నారు. ఎన్టీఆర్‌ బిసిలకు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ మేలు చేయాలనే చంద్రబాబు నాయుడు తీసుకొన్న నిర్ణయమే బిసిల డిక్లరేషన్‌ అని అన్నారు. వినుకొండ శాసనసభ్యుడు జివిఎస్‌ ఆంజనేయులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ బీసీలను పార్టీ జెండాలు కట్టడానికి, పార్టీకి ఓట్టు వేయడానికి మాత్రమే ఉపయోగించుకొన్నారన్నారు. బిసిల సదస్సు రాష్ట్రంలో తొలిసారిగా నరసరావుపేటలో నిర్వహించడం భవిష్యత్తులో ఒక మలుపు అని వ్యాఖ్యానించారు. చంద్రగిరి ఏడుకొండలు, పల్లెపు నాగేశ్వరరావు, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు కటియం కోటి సుబ్బారావు, రాజుకాశయ్య, బహ్మయ్య అప్పారావు, పాలగాని మల్లిఖార్జునరావు, ధామస్‌ తదితరులు ప్రసంగించారు.