టెహ్రాన్ చేరుకున్న ప్రధాని మోదీ
– ఉగ్రవాద నిర్మూలన, ఇంధన వనరులపై కీలక చర్చలు
ఇరాన్,మే22(జనంసాక్షి): రెండ్రోజుల ఇరాన్ పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో టెహ్రాన్ చేరుకున్నారు. చాబహార్ ఓడరేవు ప్రాజెక్టు తొలిదశ ఒప్పందంపై మోదీ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉగ్రవాద నిర్మూలన, ఇంధన వనరులపై ఇరాన్‌తో చర్చించనున్నారు. ఇరాన్‌తో సంబంధాలు, ఇంధన భాగస్వామ్యం పెంపే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది.
మానవ, సాంస్కృతిక బంధాలు బలపడాలి
ప్రధాని నరేంద్రమోడి ఇరాన్ చేరుకున్నారు. టెహ్రాన్ లోని మెహ్రాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భాయి గంగాసింగ్ సభ గురుద్వారకు వెళ్లారు. అక్కడ సిక్కులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.తన పర్యటన రెండు దేశాల మధ్య మానవ, సాంస్కృతిక సంబంధాల్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోడి ఆశాభావం వ్యక్తం చేశారు. అందరితో కలిసిపోవడం, అందరిని కలుపుకోవడం భారతీయులకు ఉన్న ప్రత్యేకత అన్నారు. రెండు రోజులు ఇరాన్ లో పర్యటించనున్న ప్రధాని.. ఉగ్రవాద నిర్మూలన, ఇంధన వనరులపై ఇరాన్ తో చర్చించనున్నారు. దైపాక్షిక సంబంధాలు, ఇంధన భాగస్వామ్యం పెంపుపై చర్చలు జరుపుతారు. చాబహార్ ఓడరేవు ప్రాజెక్టు తొలి దశ ఒప్పందంపై ప్రధాని ప్రధానంగా దృష్టి పెట్టారు.