తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం

ఎస్‌-11 బోగీలో మంటలు.. 40మంది సజీవ దహనం?
మరో 15 మందికి గాయాలు.. దూకేసిన మరో 15 మంది..
కొనసాగుతున్న సహాయక చర్యలు
నెల్లూరు, జూలై 30 : ఘోర రైలు ప్రమాదం సంభవించింది. తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎస్‌-11 బోగీలో సోమవారం తెల్లవారుజామున మంటలు వ్యాపించడంతో సుమారు 40మంది సజీవ దహనమైనట్టు సమాచారం. అధికారికంగా మాత్రం 12మంది సజీవదహనమైనట్టు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని వారు చెబుతున్నారు. మరో 15 మంది గాయపడ్డారు. మరో 17 మంది బయటకు దూకేశారు. ఢిల్లీ నుంచి చెన్నయ్‌ వెళుతున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-11బోగీలో సోమవారం తెల్లవారుజామున 4.44 గంటలకు మంటలు లేచాయి. అప్పటికి రైలు నెల్లూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలోని విజయమహల్‌ గేటు వద్దకు చేరుకుంది. ఒక వ్యక్తి చైను లాగడంతో డ్రైవర్‌ రైలును నిలిపివేశారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ బోగీలో మొత్తం 72మంది ఉన్నట్టు రైల్వే అధికారుల సమాచారం. ఎమర్జెన్సీ విండో ఒక్కటే తెరుచుకోవడంతో 17మంది మాత్రమే బయటపడ్డారు. 40మంది సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. గుర్తు పట్టలేని విధంగా మాంసపు ముద్దలు, అస్తి పంజరాలు దర్శనమిస్తున్నాయి. ఎక్కువగా అప్పర్‌, మిడిల్‌ బెర్త్‌లలో పుర్రెలు, మాంసపు ముద్దలు దర్శనమిస్తున్నాయి. ఒక తల్లీబిడ్డ కలిసి సజీవ దహనమైన దృశ్యం అందర్ని కలచివేస్తోంది. ఇదిలా ఉండగా రైల్వే శాఖ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వంతున అందజేయనున్నట్టు తెలిపింది.
రైల్వే చార్టు ప్రకారం..
రైల్వే చార్టు ప్రకారం ఎస్‌-11 బోగీలో ప్రయాణీకుల వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 17మంది, వరంగల్‌లో 6, విజయవాడలో 28, భోపాల్‌లో 11, ఆగ్రాలో 3, నాగపూర్‌లో ఒకరు, ఝాన్సీలో ఒకరు ఎక్కినట్టు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది విజయవాడ, వరంగల్‌కు చెందిన వారే ఉన్నారని తెలిసింది. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
కొనసాగుతున్న సహాయక చర్యలు
సంఘటన సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, అధికారులు, అగ్నిమాపక కేంద్రం అధికారులు, సిబ్బంది హుటాహుటిన దుర్ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు. ఎస్‌-11 బోగీ లింక్‌ను కట్‌ చేశారు. గ్యాస్‌ కట్టర్లతో తలుపులు కోసి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. గాయపడిన వారిని నెల్లూరు నగరంలోని రామచంద్రారెడ్డి ఆసుపత్రి, బొల్లినేని, ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. కలెక్టర్‌ బి.శ్రీధర్‌, ఎస్‌పి బీవీ రమణకుమార్‌, ఎంపి మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి, తదితరులు సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి 11గంటలలోపు నెల్లూరుకు రానున్నట్టు సమాచారం. అలాగే కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి మునియప్ప, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి తదితరులు కూడా చేరుకోనున్నట్టు తెలిసింది.
షార్ట్‌ సర్క్యూట్‌.. కలెక్టర్‌
గుర్తించాకే.. తెలుస్తుంది : ఎస్‌పి
షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఈ సంఘటన జరిగి ఉండొచ్చని జిల్లా కలెక్టర్‌ బి.శ్రీధర్‌ తెలిపారు. ఎంతమంది సజీవ దహనమైంది చెప్పజాలమని జిల్లా ఎస్‌పి బీవీ రమణకుమార్‌ తెలిపారు. రైల్వే అధికారులు విడుదల చేసే చార్ట్‌లోని పేర్లు ఆధారంగా చనిపోయిన వారిని గుర్తించడం జరుగుతుందని రమణకుమార్‌ వెల్లడించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎంపి మేకపాటి రాజ్‌మోహన రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు తరచు జరుగుతున్నా అప్రమత్తత లోపించడం వల్లే అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు.