తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష
శ్రీకాకుళం, ఆగస్టు 2 : తల్లి పాలతోనే బిడ్డకు ఎంతో మేలు జరుగుతుందని, అప్పుడే పట్టిన బిడ్డలకు తప్పనిసరిగా తల్లిపాలు పట్టాలని సరుబుజ్జిలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి చాపర వైభవ్ అన్నారు. సరుబుజ్జిలి మండలంలోని కె.జె.పేట, సరుబుజ్జిలి, విజయరాంపురం, కొత్తకోట గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి ఆకుకూరలు, పండ్లు, పౌష్టికాహారం తీసుకుంటే బిడ్డకు పూర్తి స్థాయిలే పాలందుతాయన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపే ఇవ్వాల్సిన తొలి ఆహారం ముర్రుపాలు అన్నారు. ఆరోగ్య పర్యవేక్షకులు జి.కృపారాణి మాట్లాడుతూ తల్లి ఇచ్చే ముర్రుపాలు బిడ్డ రోగనిరోధక శక్తిని ఆరోగ్య పెరిగేందుకు దోహదం చేసే పోషకాలున్న అత్యుత్తమ ఆహారం అని వివరించారు. మొదటి ఆరు నెలల్లో వచ్చే తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ పోషకాహారం అందిస్తాయన్నారు. తల్లిపాలలో బిడ్డకు కావల్సినంత మాంసకృత్తులు, కొవ్వు, విటమిన్లు, కాల్షియం తదితర పోషకాలన్నీ ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ పర్యవేక్షకులు ఎల్.సుశీల, జి.అమ్మన్నమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.